ప్రేక్షకులను ఉర్రూతలుగించిన​ వినాయకుడి పాటలు

21 Aug, 2020 15:37 IST|Sakshi

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో సహా.. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతాయి. ప్రతి వీధిలో ఒక గణేష్‌ మండపం తప్పనిసరి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బొజ్జ గణపయ్య దగ్గర చేరతారు. ఇక చిన్నారుల సంతోషానికి హద్దే ఉండదు. వినాయకుడి చేతిలో లడ్డు, వాహనం ఎలుక ఎంత ముఖ్యమో.. గణేష్‌ మండపంలో మ్యూజిక్‌ సిస్టమ్‌ అంతే ముఖ్యం. ఇక ఉదయం, సాయంత్రం ఓ ఐదారు గంటల పాటు వినాయకుడి పాటలతో హోరెత్తిస్తారు. ప్రస్తుతం ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా కొన్ని వందల కొత్త పాటలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని పాటలు వచ్చినప్పటికి మన తెలుగు సినిమాల్లోని కొన్ని వినాయకుడి పాటలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అలా కమర్షియల్‌ చిత్రాల్లో బాగా పాపులర్‌ చెందిన లంబోదరుడి పాటలు.. 

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా
వెంకటేష్‌, టబు జంటగా నటించి కూలీ నం.1 చిత్రంలో వినాయకుడిని కొలుస్తూ.. వచ్చే ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’ పాట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1999లో వచ్చిన ఈ చిత్రంలో వినాయకుడి గురించి వచ్చే ఈ పాట ఎవర్‌ గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇప్పటికి ప్రతి గణేష్‌ మంటపం దగ్గర ఈ పాట ప్లే కావాల్సిందే.

వక్రతుండ మహకాయ
కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ‘దేవుళ్లు’ సినిమాలో గణేశుడ్ని కీర్తిస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా నటించి, పాడిన ‘వక్రతుండ మహకాయ’ పాట ఇప్పటికి వినాయక చవితి ఉత్సవాల్లో వినిస్తూనే ఉంటుంది. (గణేశ్‌ ఉత్సవాలకు 127 ఏళ్లు)

జై జై గణేషా..
కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2006 లో విడుదలైన ‘జై చిరంజీవి’ సినిమాలోని ‘జై జై గణేషా’ పాటకు మాస్‌లో సూపర్‌ క్రేజ్‌. ఇక మెగస్టార్‌ చిరంజీవి చిందేసిన పాట కావడంతో ప్రతి గణేషుడి మంటపం దగ్గర ఈ పాట హోరెత్తాల్సిందే. 

గణపతిబప్పా మోరియా
హిందీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన ‘ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్’‌ (ఏబీసీడీ)సినిమాలోని ‘గణపతిబప్పా మోరియా’ పాట దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన తెలుగు నాట కూడ గణేష్‌ మండపాల్లో ఈ పాట తప్పక వినిపిస్తుంది. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు)

ఇక మహేశ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’లో జగడమే పాటలో ఒక బిట్‌లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ఒక బిట్ సాంగ్ ఉంది. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ నటించిన ‘పవర్’ సినిమాలో వినాయకుడి పాటలు ఉన్నాయి. ఇక రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాలో వినాయకుడిపై ఒక పాట ఉంది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ మూవీలో వినాయకుడిని కీర్తిస్తూ.. ‘గం గం గణేషా’ అనే పాట తెరకెక్కిందే. ఇక నాని, నాగార్జున నటించిన దేవదాస్‌ చిత్రంలోని ‘లక లక లకుమికరా’ పాట కూడా బొజ్జ గణపయ్యను కొలిచే పాటే. అలానే నాగ చైతన్య, తమన్న జంటగా వచ్చిన 100 పర్సెంట్‌ లవ్‌లో కూడా ‘తిరు తిరు గణనాథ’ అంటూ లంబోదరుడి పాట ఉంది. 

మరిన్ని వార్తలు