‘బిడ్డకు పాలిచ్చిన తల్లి’..క్షమాపణ చెప్పాల్సిందే!

30 Mar, 2021 09:31 IST|Sakshi

‘ఆఫీసులో బిడ్డకు పాలిస్తూ తీసుకున్న ఫొటో తీసుకోవడమే కాక, సోషల్‌ మీడియాలో పోస్టు చేసి దేశ మహిళల పరువును తక్కువ చేస్తావా? వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇకపై ఇలాంటి తప్పు చేయనని హామీపత్రం రాసివ్వు’ అంటూ గదమాయించారు ఉన్నతాధికారులు ఆ మహిళా ఉద్యోగిని. ఆమె ఏమీ మాట్లాడలేదు.. మాట్లాడే అవకాశమూ లేదు. మౌనంగా వాళ్లు అడిగిన హామీపత్రం రాసి ఇచ్చి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆమె మనసులో చెలరేగిన ప్రశ్న ‘దేశ మహిళల పరువు పోయేది ఆఫీసులో బిడ్డకు పాలివ్వడం వల్లనా? లేక ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్లనా?!’ 

ఇది జరిగింది కంబోడియాలో.. జరిగి సుమారు మూడు వారాలకు పై మాటే. ఆ తల్లి పేరు సిథాంగ్‌ సొఖా. స్టంగ్‌ ట్రెంగ్‌ రాష్ట్రంలోని సియామ్‌ పాంగ్‌ జిల్లాలో డిప్యూటీ పోలీస్‌ చీఫ్‌గా పనిచేస్తోంది. సొఖాకు ఏడాది బాబు ఉన్నాడు. మార్చి 2న పిల్లాడిని తీసుకొని డ్యూటీకి హాజరయ్యింది. కాసేపటికి పిల్లాడు ఏడవడంతో ఆఫీసు బయట చెట్టు కింద కూర్చొని పాలు పట్టింది. అక్కడే ఉన్న ఆమె సహోద్యోగి ఫొటో తీసింది. ఆ ఫొటోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన సొఖా ‘పిల్లలపై తల్లి ప్రేమను సిగ్గు ప్రభావితం చేయలేదు’ అంటూ క్యాప్షన్‌ రాసింది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అటు ఇటు తిరిగి సొఖా ఉన్నతాధికారుల కంట పడింది. మార్చి 9న.. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మరుసటి రోజు సొఖాను ఆఫీస్‌కు రప్పించారు. ఆ సందర్భంగా ఆమెతో వాళ్లన్న మాటలే పైన చెప్పినవి. 

గళమెత్తిన మహిళా సంఘాలు..
సొఖా హామీపత్రం రాసింది కానీ బహిరంగ క్షమాపణ మాత్రం చెప్పలేదు. కానీ, సొఖా విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన తెలిసి దేశవ్యాప్తంగా మహిళా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘ఇది పనిచేసే చోట మహిళలపై చూపుతున్న వివక్షకు నిదర్శనం. విధుల్లో ఉన్న తల్లులను పిల్లల సంరక్షణ లేదా డ్యూటీలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని చెప్పడం దారుణం. దీన్ని బట్టి మహిళల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది’ అంటూ వేలాది మంది గళమెత్తారు. సొఖాకు మద్దతుగా సోషల్‌ మీడియాలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. 

వివరణలూ వివాదాస్పదమే..
సొఖా విషయంలో అలజడి చెలరేగడంతో ఆమె ఉన్నతాధికారులు దిద్దుబాటుకు దిగారు. ‘డ్యూటీలో ఉండగా పిల్లాడికి పాలివ్వడాన్ని తప్పు పట్టలేదు. కాకపోతే ఆమె ఆ ఫొటోను ‘పర్మిషన్‌’ తీసుకోకుండా పోస్ట్‌ చేసినందుకు మాత్రమే మందలించామ’ని వివరణ ఇచ్చారు. ఇది మరింత ఆజ్యానికి కారణమైంది. ఈ వివరణ మహిళల మాట్లాడే స్వేచ్ఛను కాలరాసేలా ఉందని హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు. ఆ వివరణ ఇచ్చిన పోలీసాఫీరు మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖే జోక్యం చేసుకుంది. సొఖా విషయంలో పోలీసు అధికారుల తీరును తప్పుపడుతూనే పనిచేసే చోట, పబ్లిక్‌ ప్రదేశాల్లో మహిళలు పిల్లలకు పాలిచ్చేటప్పుడు చాటుగా లేదా, ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా ఉంచుకోవాలని సూచించింది. దీనిపైనా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘పనిప్రదేశాల్లో ఓ మహిళ తన బిడ్డకు పబ్లిక్‌గా పాలివ్వడం ఆ ఆఫీసుకు, దేశ మహిళల పరువుకు ఏ విధంగా భంగమో తెలియడం లేదు. నిజానికి టీవీల్లో వచ్చే ప్రకటనల్లో చాలా భాగం అశ్లీలతతో కూడుకొన్నవే. మరి వాటి వల్ల దేశ మహిళల పరువుకు భంగం కలగదా?’ అని ప్రశ్నిస్తున్నారు కంబోడియా మానవ హక్కుల కేంద్రం అధిపతి చాక్‌ సొఫియా. 

ప్రధాని సతీమణి మద్దతు..
సొఖాకు మద్దతుగా గళమెత్తే వాళ్ల సంఖ్య పెరగడంతో విషయం ఆ దేశ ప్రధాని సతీమణి బున్‌ రనీ హున్‌ సెన్‌కు చేరింది. వెంటనే ఆమె సొఖాకు ఓ లేఖతోపాటు 2,500 డాలర్లను బహుమతిగా పంపారు. అలాగే స్టంగ్‌ ట్రెంగ్‌ రాష్ట్ర గవర్నర్‌తోపాటు సొఖాను తప్పుపట్టిన ఉన్నతాధికారులు సైతం బహుమతులు అందించారు. ఇలా దేశం నలుమూలల నుంచి సొఖాకు మద్దతు బహమతులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. మరోవైపు, ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా పుల్‌స్టాప్‌ పడాలని సొఖా కోరుకుంటోంది.

‘నేను పనిచేసే చోట ఉండే సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం నా పోస్ట్‌ ఉద్దేశ్యం కాదు. పిల్లాడిపై ఓ మాతృమూర్తి ప్రేమను చెప్పాలనుకున్నాను అంతే’ అంటోంది. నిజానికి ఈ వివాదం కొన్ని వారాలు గడిచినా ఇప్పటికీ చల్లారడం లేదు. విషయం ఏకంగా ఐక్యరాజ్యసమితికి చేరడంతో కంబోడియా ఆందోళనకు గురవుతోంది. అసలే ఆ దేశంలో మహిళలపై హింస ఎక్కువనే అపవాదు ఇప్పటికే ఉండడమే దీనికి కారణం. 
 

మరిన్ని వార్తలు