ఇంట్లోనే విడాకుల వాదనలు వకాలత్‌ ఫ్రమ్‌ హోమ్‌

10 Sep, 2020 08:22 IST|Sakshi

వెబ్‌ సిరీస్‌

కోర్టు మెట్లెక్కాల్సిన పని లేదు. పిలుపు కోసం గంటలు గంటలు వెయిట్‌ చేయాల్సిన పని లేదు. వాదనలు ఇంటి నుంచి వినిపించవచ్చు. మన పాయింట్‌ ప్రూవ్‌ చేయడానికి ఎంత సేపైనా మాట్లాడవచ్చు. అంతా కెమెరా సాక్షిగా జరిగే ఈ ‘కుటుంబ నాటకం’ అమేజాన్‌ ప్రైమ్‌లో రానుంది. ఆ సిరీస్‌ పేరు ‘వకాలత్‌ ఫ్రమ్‌ హోమ్‌’. కరోనాకు ముందు అంతా కోర్టులోనే జరిగేది. కరోనా తర్వాత అవసరమైన కేసులకు వీడియో సెషన్స్‌ జరుగుతున్నాయి. వాదులు, ప్రతివాదులు, న్యాయవాదులు, న్యాయమూర్తి అందరూ కెమెరాల ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ పాయింట్‌ను పట్టుకుని కలహాల కాపురాల్లోని సరదాలను, మొగుడూ పెళ్లాల సిల్లీ గొడవలని, తమ పార్టనర్‌లపై కోల్పోయిన అపనమ్మకాలను ముఖ్యకథాంశంగా తీసిన పది ఎపిసోడ్‌ల సిరీస్‌ ‘వకాలత్‌ ఫ్రమ్‌ హోమ్‌’. సెప్టెంబర్‌ 10 నుంచి స్ట్రీమ్‌ కానుంది.

ఇందులో సుజిన్, రాధిక అనే భార్యాభర్తలు విడిపోయి ఎవరి ఇంట్లో వారు ఉంటుంటారు. ఇద్దరూ విడాకులు కోరుకుంటారు. న్యాయమూర్తి వీడియో సెషన్స్‌ ద్వారా కేసు తేలుద్దామంటాడు. భర్త తరఫున ఒక ఆడలాయర్, భార్య తరుపున ఒక మగలాయర్‌ వాదనలకు దిగుతారు. ఇక అక్కడి నుంచి భార్య తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నుంచి భర్త తప్పులను చెబుతుంటే, భర్త తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నుంచి భార్య తప్పులను చెబుతుంటాడు. కేసు వినాల్సిన జడ్జి గారు ఇంట్లో తప్పక చేయాల్సిన వంట పని చేస్తూ పాయింట్లు నోట్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ సిరీస్‌లో భార్యభర్తలుగా ఇప్పటికే వెబ్‌ ప్రపంచంలో ఫేమస్‌ అయిన సుమీత్‌ వ్యాస్, నిధి సింగ్‌ నటించారు. ప్రఖ్యాత దర్శకుడు రమేశ్‌ సిప్పి సంస్థ రమేష్‌ సిప్పి ఎంటర్‌టైన్‌మెంట్‌ దీనిని నిర్మించింది. రమేశ్‌ సిప్పి కుమారుడు రోహన్‌ సిప్పి దర్శకుడు.


 

మరిన్ని వార్తలు