10 కే స్టెప్స్‌.. ఇలా నడిస్తే ఎన్నో లాభాలు

22 Jan, 2022 11:09 IST|Sakshi

3,280 అడుగుల దూరం = కిలోమీటరు

16, 400 అడుగుల దూరం = 5 కిలోమీటర్లు

నడకతో ఈ దూరాన్ని పూర్తి చేయాలంటే కొంచెం అటూఇటూగా పదివేల స్టెప్స్‌ వేయాలి

కోవిడ్‌ వచ్చింది. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్‌... డెల్టాలు ఒమిక్రాన్‌లు... అన్నీ కలిసి మనిషి ఆరోగ్యంతోపాటు జీవనశైలిని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లు షురూ అయిపోయాయి. డెస్క్‌ వర్క్‌ చేసేవారికి మామూలు రోజుల్లో కూడా కంఫర్టబుల్‌ లైఫ్‌ స్టైల్‌లో తగినంత నడక లేక దేహానికి ఎప్పుడూ ఏదో ఒక సవాల్‌ ఉండేది. ఇప్పుడైతే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే వ్యాయామం కూడా ఉండడం లేదు. దాంతో అనారోగ్యం అవకాశం కోసం పొంచి ఉన్న శత్రువులాగ ఉందనే చెప్పాలి. ఇందుకు టెన్‌ ఓ  స్టెప్స్‌ సొల్యూషన్‌ను సూచిస్తున్నారు వైద్య నిపుణులు. 10 కే అంటే పది కిలోమీటర్ల దూరం కాదు, పది వేల అడుగులు.

పదివేల అడుగుల లెక్క కోసం ప్రతి అడుగునూ లెక్కపెట్టుకోవాల్సిన పని లేదు. సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం నడిస్తే పదివేల అడుగులు పూర్తవుతాయని ఆరోగ్య జాగ్రత్తలతోపాటు అడుగుల లెక్క కూడా చెబుతోంది స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ. పదివేల అడుగుల్లో ఏడు వేల అడుగులు మామూలు నడక, మూడు వేల అడుగులు మాత్రం బ్రిస్క్‌ వాక్‌ లేదా జాగింగ్‌ చేయాలి. బ్రిస్క్‌ వాక్‌ చేసేటప్పుడు దేహం పక్కన ఫొటోలో ఉన్నట్లు నిటారుగా ఉంచి కింది పొట్ట, హిప్‌ కండరాలను బిగపట్టి, భుజాలను జారవేయకుండా వెనక్కు తీసుకుని ఛాతీని విశాలంగా ఉంచి నడవాలి.

నడక ద్వారా మెదడు ఉత్తేజితమవుతుంది. కొత్త ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. మెదడులో అల్లిబిల్లిగా తిరుగుతూ చికాకు పెడుతున్న అనవసరపు విషయాలు పక్కకు వెళ్లిపోతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లు నడకను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.

మంచి నడక మంచి నిద్రకు దారి తీస్తుంది. మంచి నిద్ర దేహానికి పునఃశక్తినిస్తుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే మానసిక ఆందోళన, నిరాశపూరిత ఆలోచనలు దూరమవుతాయి. అయితే ఈ ఫలితం కోసం నడిచే నడక మామూలుగా ఉండకూడదు. క్విక్‌ వాక్‌ చేయాలి. ఇది దాదాపుగా పరుగును తలపిస్తుంది. ఈ నడకలో ఒకపాదం నేల మీద ఉంటే మరోపాదం దాదాపుగా గాల్లోనే ఉంటుంది. అలాగే నడక మీదనే ధ్యాస ఉంచాలి. పది నిమిషాల సేపు ఇలా నడిస్తే దేహం సాంత్వన ఫీలవుతుంది. యాస్పిరిన్‌ టాబ్లెట్‌ వేసుకున్నప్పుడు కలిగేటువంటి భావన అన్నమాట. ఇది ఎక్కువ గంటలు కొనసాగదు. కానీ రోజూ ఈ స్థితికి చేరడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

నడకతో బ్లడ్‌ ప్రెజర్‌ క్రమబద్ధమవుతుంది. రక్తం రక్తనాళాల ద్వారా దేహంలోని అన్ని భాగాలకూ సక్రమంగా ప్రవహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే రక్తాన్ని పంప్‌ చేయడం అనే పనిని సులువుగా నిర్వర్తిస్తుంది. గుండె పని తీరు మందగిస్తే రక్తప్రసరణ వేగం కూడా తగ్గిపోతుంది. నడక గుండె కొట్టుకునే వేగాన్ని, లయను కూడా నిర్ధారిస్తుంది. 

నడిచేటప్పుడు దేహం ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అంటే ఎక్కువ గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గుతాయి. దేహంలో అనవసరమైన గ్లూకోజ్‌ నిల్వలు చేరవు. కాబట్టి అధికబరువు, ఒబేసిటీ సమస్యలకు కూడా నడకే ఔషధం.

కరోనా కాలం ప్రతిఒక్కరినీ మానసికంగా ఆందోళనకు గురిచేసింది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారనే కానీ, ఒంట్లో ప్రతి భాగమూ పరీక్షకు లోనవుతోంది. పరోక్షంగా గుండెను ప్రమాదంలో పడేస్తాయి. నడక ద్వారా కార్డియోవాస్కులర్‌ వ్యాధులు దరి చేరవనే విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్లు అందరూ నిరభ్యంతరంగా చేయగలిగిన వ్యాయామం నడక.

‘వాచ్‌’ చేస్తుంది
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనే రెండు రకాల ప్రయోజనాలనిచ్చే నడక కోసం ఇక మీనమేషాలు లెక్కపెట్టవద్దు. నడవడానికి పాదానికి అనువైన షూస్‌ ధరించండి. పదివేల అడుగులకు దూరాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికి మార్కు చేసుకోవడం అని ఆలోచించాల్సిన పని లేదు. సెండెంటరీ లైఫ్‌ స్టయిల్‌ను సవాల్‌ చేస్తూ వచ్చింది యాపిల్‌ వాచ్‌. మన కదలికలను లెక్క వేస్తుంటుంది. అడుగుల లెక్క చూపిస్తుంది. ఎన్ని కేలరీలు కరిగాయో కచ్చితంగా చెప్తుంది. మనకు కరభూషణంగా మారిన స్మార్ట్‌ ఫోన్‌లు కూడా ఈ పని చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు