గుండెపోటు లక్షణాలపై అవగాహనకు ఓ కథనం..

18 Feb, 2021 00:06 IST|Sakshi

గుండెపోటు గురించి మనందరికీ తెలిసిన లక్షణం... ఛాతీలో నొప్పి రావడం! గుండె పట్టుకుని రోగి కూలబడిపోవడం!! అయితే అన్ని వేళలా గుండెపోటు ఇదేవిధంగా రాదు. కాస్తంత భిన్నమైన లక్షణాలతో కూడా వస్తుంటుంది. కానీ మనలో ఏర్పడిపోయిన స్థిరమైన భావనలతో అలా ఛాతీకి ఎడమపక్కన గుండెనొప్పి వస్తేనే గుండెపోటు అని అనుకుంటాం.  సాధారణంగా కాకుండా ఒకింత భిన్నంగా వ్యక్తమయ్యే గుండెపోటు లక్షణాల (ఎటిపికల్‌ సింప్టమ్స్‌)పై అవగాహన కోసం ఈ కథనం. 

గుండెను బాగా నొక్కేసినట్లుగానో లేదా గుండెను పిండేసినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంటే దాన్ని గుండెపోటుగా గుర్తించడం సాధారణం. ఈ ప్రధాన లక్షణంతో పాటు కనిపించే మరికొన్ని సాధారణ లక్షణాలూ ఉంటాయి. అవేమిటంటే... గుండెపోటు వచ్చినప్పటికీ కొందరిలో నొప్పి ఏమీ లేకుండా కేవలం ఛాతీలో బరువుగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఛాతీలో మంటగానూ వ్యక్తం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో దీన్ని చాలామంది గ్యాస్‌ తాలూకు మంటగా భావిస్తుంటారు. ఈ మంట వంటి ఫీలింగ్‌ ఒక్కోసారి ఛాతీ ముందరి భాగం నుంచి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండవచ్చు. కొందరిలో ఎడమ భుజం, ఎడమ చేయి నొప్పి రూపంలోనూ గుండెపోటు వ్యక్తం కావచ్చు.

ఇలాంటి నొప్పి దాదాపు అరగంట మొదలుకొని, కొన్ని గంటలపాటు కూడా కనిపిస్తుండవచ్చు. ఈ నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా... అంటే కాస్తంత వేరుగా (డిఫరెంట్‌)గా ఉంటుంది. అంటే... కొందరిలో భరించగలిగేంతగా ఉండవచ్చు. మరికొందరిలో చాలా తీవ్రంగానూ, ఏ మాత్రం భరించలేనంతగా ఉండవచ్చు. ఆ లక్షణంతోపాటు మరికొందరిలో విపరీతమైన చెమటలు (ప్రొఫ్యూజ్‌డ్‌ స్వెటింగ్‌) కూడా ఉండవచ్చు. ఇవన్నీ గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే సాధారణ (క్లాసికల్‌) లక్షణాలు. కాకపోతే గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఈ క్లాసికల్‌ లక్షణాలు కనిపించకపోవచ్చు. 

విలక్షణ లక్షణాలివే... 
కొందరు రోగుల్లో సాధారణంగా కనిపించే గుండెపోటు లక్షణాలు కాకుండా కాస్తంత వేరుగా హార్ట్‌ ఎటాక్‌ వ్యక్తం కావచ్చు. ఇలాంటి అసాధారణ (ఎటిపికల్‌) లక్షణాలు ఎక్కువగా షుగర్‌ ఉన్నవారిలోనూ, మహిళల్లోనూ, మరికొంతమంది పురుషుల్లోనూ కనిపించవచ్చు. ఆ అసాధారణ లక్షణాలివే... గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో ఛాతీలో నొప్పి లేకుండా కేవలం కింది దవడ భాగంలో మాత్రమే నొప్పి ఉండవచ్చు. కొందరి విషయంలో అది కడుపులో నొప్పి రూపంలోనూ వ్యక్తం కావచ్చు. మరికొందరిలో దవడ కింది  (లోవర్‌ జా) నుంచి మొదలుకొని బొడ్డు (అంబ్లికస్‌) వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు. అంటే...  దవడ, మెడ, భుజం, చేతులు, పొట్ట... ఇలా ఎక్కడైనా నొప్పి రావచ్చు. పొట్టలో నొప్పిని గుండెపోటుగా అనుమానించడం సాధారణంగా సాధ్యం కాని విషయం కదా. అందుకే కడుపులో వచ్చే నొప్పిని కొందరు సాధారణంగా గుండెపోటుగా కాకుండా...  అసిడిటీ వల్ల వచ్చే నొప్పిగా పొరబడే అవకాశాలే ఎక్కువ. 

నొప్పి లేకుండా కూడా గుండెపోటు వస్తుందా? 
ఒక్కోసారి గుండెపోటు ఏమాత్రం నొప్పి లేకుండా కూడా రావచ్చు. షుగర్‌ ఉన్నవారికి నరాలు మొద్దుబారతాయనీ, దాంతో నొప్పి తెలియకపోవడం అన్న లక్షణం ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నొప్పి తెలియక పోవడమనే లక్షణం గుండెపోటుకూ వర్తించి సైలెంట్‌గా వచ్చే ముప్పుగా పరిణమించవచ్చు. అలా గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి లేకపోవడంతోపాటు ఈ కింది లక్షణాల్లో ఒకటిగాని, రెండుగాని లేదా అంతకు మించిగాని కనిపించవచ్చు. 
♦కొద్దిగా శ్రమపడ్డా లేదా ఒక్కోసారి ఏమాత్రం శ్రమపడకపోయినా ఊపిరి అందనంత ఆయాసం రావచ్చు. 
♦తలంతా బాగా తేలికైనట్లుగా (లైట్‌ హెడెడ్‌నెస్‌)అనిపించవచ్చు. ఒక్కోసారి స్పృహ కోల్పోవడమూ జరగవచ్చు.
♦విపరీతమైన నీరసం, నిస్సత్తువ ఆవరించవచ్చు. 
♦అకస్మాత్తుగా అజీర్ణం (అక్యూట్‌ ఇన్‌డైజెషన్‌) 
♦వికారం, వాంతులు పక్షవాతం వచ్చిన లక్షణాలు. 

సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌! 
గుండెపోటు లక్షణాలు ఏమీ లేకుండా కూడా గుండెపోటు (సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌) రావచ్చు. ఇలాంటివారిలో రొటీన్‌ చెకప్‌లో భాగంగా వైద్య పరీక్షలు చేసినప్పుడే వాళ్లకు గుండెపోటు వచ్చిందనే విషయం తెలియవస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇలాంటి సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. 

సాధారణ లక్షణాలు కాకపోవడంతో అలక్ష్యం 
చాలామంది తమకు కనిపించిన లక్షణాల్లో గుండెపోటు తాలూకు సాధారణ (క్లాసిక్‌) లక్షణాలు కనిపించకపోవడంతో దాన్ని హార్ట్‌ఎటాక్‌గా పరిగణించక చికిత్సకు వెళ్లరు. అంటే... కడుపు నొప్పి, కడుపులో మంట వస్తే దాన్ని అసిడిటీ అనుకుంటారు.  ఇంకొన్నిసార్లు... ముందే చెప్పినట్లుగా ఏమాత్రం నొప్పి లేకపోవడం లేదా ఆ నొప్పి తీవ్రత గుండెపోటుదని గుర్తించలేనంత కొద్దిగా మాత్రమే ఉండటంతో దాన్ని గుండెపోటుగా భావించరు. ఇలాంటి సమయాల్లో రోగికి నష్టం కలగవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయమూ సంభవించవచ్చు. అందుకే సాధారణ లక్షణాలతో పాటు పైన కనిపించిన సాధారణం కాని లక్షణాలు కనిపించినా ఒక్క ఈసీజీ తీయించుకోవాలి. దాంతో పాటు ఒక్కోసారి టూడీ ఎకో, ట్రెడ్‌మిల్‌ లాంటి పరీక్షలు కూడా చేయించుకోవాల్సి రావచ్చు. 

ఎందుకంత తొందరంటే...? 
గుండెపోటు అంటే గుండె కండరానికి అందాల్సిన రక్తం అందకపోవడం అన్నమాట. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు వీలైనంత త్వరగా రక్తసరఫరాను పునరుద్ధరించకపోతే... గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోతుంది. ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందక రోగి మరణించవచ్చు కూడా. అందుకే గుండెపోటు వచ్చినవారిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు చేర్చాలి. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పైన పేర్కొన్న చెమటలు పట్టడం... కడుపులోనొప్పి వంటివి సాధారణంగా ప్రతివారిలోనూ ఏదో ఒక సమయంలో కనిపించే లక్షణాలే. అయితే ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసి ఆందోళన పడకూడదు. ఆందోళన చెందడం వల్ల ముప్పు మరింత పెరుగుతుంది. కాకపోతే బి.పి, డయాబెటిస్‌ వంటి రిస్క్‌ ఫ్యాక్టర్లు ఉన్నవారు మాత్రం తగినంత జాగ్రతపడాల్సిన అవసరం ఉంది కాబట్టి... అలాంటివారు మాత్రం ఈసీజీ, ఎకో, టీఎంటీ లాంటి పరీక్షలు చేయించుకుని నిశ్చింత గా ఉండాలి. బీపీ, షుగర్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్‌ఎటాక్స్‌ ఉన్నవారు, ఊబకాయం, వయసు పైబడటం, ఇతరత్రా రిస్క్‌ఫాక్టర్స్‌ ఉన్నవారు హార్ట్‌ఎటాక్‌తో సంబంధం లేని లక్షణాలు కనిపించినా, ఎటిపికల్‌ సింప్టమ్స్‌ కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలాంటి రిస్క్‌ఫాక్టర్లు లేనివారు, ఇటీవలే మొత్తం పరీక్షలు చేయించుకుని అవి నార్మల్‌గా ఉన్నవారు అంతగా భయపడాల్సిన అవసరం లేదు.  

మరిన్ని వార్తలు