మంచి మాట: పాతుకుపోయినా... తప్పు తప్పే!

28 Nov, 2022 04:31 IST|Sakshi

సంస్కరణలకూ, కచ్చితత్వానికీ మన జీవనవిధానంలోనూ సమాజంలోనూ, కళారంగంలోనూ  వ్యతిరేకత ఎదురౌతూనే ఉంటుంది. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాతబృందం సంస్కరణలనూ, నిర్దుష్టతనూ స్వీకరించనూ లేదు, హర్షించనూ లేదు. పాతుకునిపోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని  గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు.

పాతది కాబట్టి అదంతా మంచిది కాదు; కొత్తదైనందువల్ల అది అధమమైనది లేదా పనికిమాలినది కాదు; తెలివైనవాళ్లు పలు పరిశీలనలు చేసి (విషయాన్ని) తీసుకుంటారు; మూఢులు పరులను అనుసరిస్తారు అన్న ఎరుకను కాళిదాసు ఎప్పుడో తెలియజెప్పారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. సంస్కరణలను, నిర్దుష్టత్వాన్ని ఎంత మాత్రమూ స్వీకరించలేని, హర్షించలేని పాత బృందానికి అతీతంగా నేటి తరమైనా  సంస్కరణలతో కచ్చితత్వాన్ని సాధించగలగాలి. ‘పాత అడుగుజాడలు తొలగిపోయినప్పుడు అద్భుతాలతో కొత్తదేశం వ్యక్తమౌతుంది‘ అని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పిన దాన్ని మనం ఆలోచనల్లోకి తీసుకోవాలి.

అలవాటయ్యాయి కదా అని తప్పుల్ని ఆచరించడం, కొనసాగించడం సరికాదు. అలవాట్ల ఏట్లో పడి కొట్టుకుపోతూ ఉండడం మనిషి జీవనానికి పరమార్థం కాదు. ‘మనం చూడం; ఎందుకంటే మనకు చూడడం గురించి అభిప్రాయాలున్నాయి‘ అని జిడ్డు కృష్ణమూర్తి ఉన్న లోపాన్ని చెప్పారు. అందుబాటులో ఉన్నవి సరైనవి అనే అభిప్రాయానికి అతీతంగా మనం కళ్లు తెరుచుకుని చూడాలి. తప్పుల్ని దాటుకుని కచ్చితత్వంలోకి వెళ్లడానికీ ఆపై సరిగ్గా ఉండడానికీ ధైర్యం, సాహసం ఈ రెండూ మనకు నిండుగా ఉండాలి.

ఇవి లేకపోవడం వల్లే మనలో చాలమంది పాత తప్పుల్లో బతుకుతూ ఉంటారు. తప్పులకు అలవాటుపడి కొనసాగడం ఒకరకమైన బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి మనం ధైర్యసాహసాలతో విముక్తమవ్వాలి. సరిగ్గా ఉండడం కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనలో చలామణి అవుతున్న తప్పుల్ని మనం తెలుసుకోవాలి. వాటి నుంచి తప్పించుకోవాలి. వాటిని మనం తప్పించెయ్యాలి. తప్పులవల్ల గతంలో జరిగిన కీడును వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ జరగకుండా పరిశ్రమించాలి.

నీళ్లవల్ల శరీరం శుభ్రపడుతుంది; సత్యంవల్ల మనస్సు శుభ్రపడుతుంది; జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది; విద్యవల్లా, తపస్సువల్లా స్వభావం శుభ్రపడుతుంది. నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. సత్యంతో మనస్సును శుభ్రంచేసుకోవడం మనం నేర్చుకోవాలి. జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది అన్న దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. విద్యవల్లా, తపస్సు(సాధన)వల్లా స్వభావం శుభ్రపడుతుందనడానికి మనమే ఋజువులుగా నిలవాలి. ముందటితరాల ద్వారా చింతన, చేష్టల పరంగా మనకు తప్పులు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు కొన్ని విషయాల్లో ఆ తప్పులే ఒప్పులుగా రూఢీ అయిపోయాయి. దానివల్ల జీవన, సామాజిక, కళల ప్రమాణాలు, ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ వాస్తవాన్ని ఇకనైనా అవగతం చేసుకోవాలి. ఈ అవాంఛనీయమైన పరిస్థితిని ఎదిరించి పోరాడి విజయం సాధించాలి.

తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాత వాళ్ల దగ్గర మేలు, మంచి ఈ రెండూ లేవు కాబట్టి వాళ్లు అవి జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జీవనవిధానంలోనూ, సామాజికంగానూ, కళలలోనూ నిర్దుష్టతను వీళ్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు సరైన దాన్ని స్వీకరిస్తే వాళ్లు తప్పుడు వాళ్లు అన్న నిజం స్థిరపడిపోతుంది కాబట్టి. చెడ్డవాళ్లకు సంస్కరణలతో  శత్రుత్వం ఉంటుంది, ప్రతి సంస్కర్తా చెడ్డవాళ్లకు విరోధే!

కల్మషమైన పాతనీరు బురద అవుతుంది. హానికరమైన పాత బురదను మినహాయించుకోవాలి. కొత్త నదులను ఆహ్వానించాలి. కొత్త సంస్కరణల్ని మిళితం చేసుకుంటూ మునుముందుకు సాగడమే మనిషికి మేలైన జీవితం అవుతుంది. మూర్ఖత్వాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందడానికి ప్రపంచంలోకి ప్రవహించాలి మనం. సంస్కరణలు మనతో మొదలవ్వాలి. ‘తమతో మొదలుపెట్టేవాళ్లే ఈ ప్రపంచం చూసిన ఉత్తమ సంస్కర్తలు‘ అని జార్జ్‌ బెర్నాడ్‌ షా అన్నారు. మనల్ని మనం సంస్కరించుకుంటూ కచ్చితత్వాన్ని సాధించుకుంటూ సరైన, ఉన్నతమైన మనుషులమౌదాం.

పాతుకుని పోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని  గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు.

– రోచిష్మాన్‌

మరిన్ని వార్తలు