Weight Loss Diet: ఆ హార్మోన్‌ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ..

20 Nov, 2021 11:44 IST|Sakshi

High Fibre Food For Weight Loss: ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ మూలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ తలెత్తిన సమస్య బరువు పెరగడం. బరువు పెరిగారనగానే వీలైనంతగా డైటింగ్‌ చేసి... పొట్ట మాడ్చుకుని, కొద్దిగా బరువు తగ్గగానే ఆ ఉత్సాహంతో యధావిధిగా తినేయడం.. ఆనక మునపటి కంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం... లైపో సక్షన్‌ వంటి వాటి వరకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం... ఇవన్నీ అవసరమా..? ఇంతకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గచ్చు. దానిపై అవగాహన కోసమే ఈ వ్యాసం. 

సాధారణంగా బరువు పెరగడం తగ్గడం అనేది శరీరతత్వాన్ని బట్టి, వంశపారంపర్య కారణాలను బట్టి కూడా ఉంటుంది. బరువు పెరగడానికి గల కారణాలేమిటో తెలుసుకుంటే తగ్గడానికి మార్గం సులువే అవుతంంది. నిత్యం యోగాసనాలు, వర్కవుట్స్‌ వంటివి చేసే సినీతారలు, ఇతర సెలబ్రిటీలు కూడా బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ అందరికీ అలా వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్‌ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగపడవచ్చు.

చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు..

తరచు మంచి నీటిని తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతారు. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా బరువు కోల్పోయినట్టు తేలింది. 

పెరగడానికి ముఖ్య కారణాలు
నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్‌ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక వ్యాధులు వస్తాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు.  

బరువు తగ్గడానికి ఉపకరించే ఆహారాలు
పసుపు: రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఎల్‌.డి.ఎల్‌ అంటే చెడు కొలెస్ట్రాల్‌నుతగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

యాలకులు: తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.

మిరప: మిరపలోని క్యాప్‌సైసిన్‌ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్‌ పెరగదు.

కరివేపాకు: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును కరివేప చకచకా ఊడ్చేస్తుంది. దీనిని కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్‌ చేసుకొని తాగినా మంచిదే.

వెల్లుల్లి: ఇందులోని యాంటీ బాక్టీరియల్‌ యాసిడ్స్‌ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్‌ బర్నింగ్‌ ఫుడ్‌’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

క్యాబేజీ: బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్‌ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూర తింటేనే మేలు.

చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే..

పెసరపప్పు: కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్‌ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్‌ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.

తేనె: మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.

మజ్జిగ: గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు ఉంటాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.

సజ్జలు: అత్యధిక ఫైబర్‌ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్‌ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.

ఆలివ్‌ ఆయిల్‌: వంట నూనెల్లో రారాజు ఆలివ్‌ ఆయిల్‌. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్‌ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. ఆలివ్‌ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

చెక్క... మొగ్గ: చెక్క అంటే దాల్చిన చెక్క. మొగ్గ అంటే లవంగ మొగ్గ. ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్‌.డి.ఎల్‌., ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. పుచ్చకాయ, మరమరాలు వంటివి కూడా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనసు ఇతర పదార్థాల మీదికి మళ్లదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా పాటించండి..
►ఆహారాన్ని నెమ్మదిగా... నమిలి తినాలి. దీనివల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్‌ వస్తుంది.
►మొక్కల నుంచి లభించే విస్కోస్‌ ఫైబర్‌ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
►పీచు పదార్థాలు ఎక్కువ గా ఉండే ఆహారం వల్ల ఆకలి వేయదు. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి.
►ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది.
►బీన్స్, ఓట్స్‌ సెరల్స్, మొలకలు, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్‌ ఉంటుంది. 

ఇవన్నీ మీ రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు తగ్గడమే కాదు... అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధులనుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు.

చదవండి: Science Facts: ఎక్సర్‌సైజ్‌ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..

మరిన్ని వార్తలు