ఎమీ హాకిన్స్‌.. మరో గంగవ్వ 

3 Feb, 2021 08:47 IST|Sakshi
110వ ఏట సెలబ్రిటీగా మారిన ఎమీ హాకిన్స్‌

టాలెంటును ప్రదర్శించడానికి వయసు అడ్డురాదని చెబుతున్నారు 110 ఏళ్ల ఎమీ హాకిన్స్‌. ఒకే ఒక్కపాటతో  ఈ బామ్మగారు ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్‌ అయిన ‘‘ఇట్స్‌ ఏ లాంగ్‌ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడింది. దానిని ఆమె మనవరాలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఎమీ హాకిన్స్‌ పేరు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. అంతేగాకుండా ఈ వీడియో సాంగ్‌ను లక్షమందికి పైగా చూశారు. 

వేల్స్‌నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్‌ ట్రూప్‌లో నర్తకిగా పనిచేసేవారు. అయితే ఇన్నేళ్లలో రాని గుర్తింపు తాజాగా ఆమె పాడిన ఒక పాటకు వచ్చింది. గత వారంలో ఆమె 110 వ ఏటలోకి అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమీ లాంగ్‌ వేటు పాట పాడింది. దాన్ని టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. వరల్డ్‌వార్‌–1 ముగిసే సమయానికి ఎమీకి ఏడేళ్లు. 1911 కార్డిఫ్‌లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్‌లో గడిపారు. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. 
(చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్‌ దేవకన్య)

1937లో సైన్‌ రైటర్‌ జార్జ్‌ హాకిన్స్‌ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్‌లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్‌ ఫైర్‌ వాచర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి జీవిస్తున్నారు. బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్‌ చేయాలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదు. బామ్మకు సోషల్‌ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్‌ సెన్సేషన్‌గా నిలవడం  మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆమెకు దక్కిన సూపర్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నామని మనవరాలు ఫ్రీమన్‌ చెప్పుకొచ్చింది’’.
 

మరిన్ని వార్తలు