Baby Blues‌: పుట్టిన బిడ్డతో పాటే.. బేబీ బ్లూస్‌..

31 Aug, 2021 19:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి మహిళకు ఎంతో ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. అదే సమయంలో కొన్ని శారీరక సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. ప్రసవానంతరం 3/4 రోజుల స్వల్ప వ్యవధిలో వచ్చే ఈ తరహా సమస్యలను బేబీ బ్లూస్‌గా పేర్కొంటారు. దీని గురించి అపోలో స్పెక్ట్రా ఆసుపత్రులకు చెందిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డా.మేఘాజైన్‌ అందిస్తున్న సూచనలివి...

దీర్ఘకాలం ఉంటే...
హార్మోన్లలో హెచ్చుతగ్గులు తద్వారా వచ్చే ప్రవర్తనా పరమైన మార్పులు, కొంత ఆందోళన తల్లల్లో కనిపించడమే ఈ బేబీ బ్లూస్‌. సాధారణంగా ఈ తరహా సమస్యలు 10రోజుల్లోగా సర్ధుకుంటాయి. అయితే 2 వారాలకు పైగా కూడా ఉంటే... వీటని ప్రసవానంతర డిప్రెషన్‌గా వ్యవహరిస్తారు. ఆ డిప్రెషన్‌ తీవ్రతను బట్టి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి/అతినిద్ర మొదలుకుని తీవ్రమైన అలసట, శక్తి హీనంగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం, మతిమరపు, ఆత్మవిశ్వాసం లోపించడం, పుట్టిన బిడ్డ మీద కూడా ఆసక్తి కనపరచకపోవడం..వంటివి ఉంటాయి. 

ప్రసవానంతర ఒత్తిడి, బ్రెస్ట్‌ ఫీడింగ్‌కి సంబంధం...
అమ్మ పాలను మించిన అమృతం లేదని మన పెద్దలెప్పుడో చెప్పినట్టుగానే ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా తల్లిపాలను పిల్లలకు అందివ్వడాన్ని ప్రోత్సహిస్తోంది. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల పుష్కలమైన పోషకాలు లభించి, బిడ్డకు అవసరమైన శక్తియుక్తులకు బలమైన పునాది పడడంతో పాటు ఇది తల్లి ఆరోగ్యానికి కూడా ఇతోధికంగా సహకరిస్తుందనేది నిస్సందేహం. తల్లిపాలు ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌గా పిలవబడే ఆక్సిటోసిన్‌ విడుదలకు కారణమవుతాయి. అంటే... ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహకరిస్తుందని తెలుస్తోంది. అయితే ఒకసారి ప్రసవానంతర డిప్రెషన్‌కు లోనవడం జరిగితే... బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పట్ల తల్లులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం కీలకం.

కొన్ని సార్లు బంధువులు, సమాజం కోసమే తల్లులు బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు బలవంతంగా అంగీకరించడం వారిలో డిప్రెషన్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి తల్లికి కౌన్సిలింగ్‌తో పాటు ప్రత్యామ్నాయాల సూచన కూడా చికిత్సలో భాగం అవుతాయి. గతంలో డిప్రెషన్‌కు గురైన దాఖలాలు ఉన్నా, తమ కుటుంబంలో ఎవరైనా ప్రసవానంతర మానసిక సమస్యలు చవిచూసి ఉన్నా, దీని గురించి జనరల్‌ ప్రాక్టీషనర్‌తో గర్భం దాల్చిన వెంటనే మాట్లాడాలి.  ప్రసవానంతర ఒత్తిడి దరి చేరకుండా కొన్ని నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు,తమ వైద్యునితో ముచ్చటించడం, సన్నిహితులతో కలిసి మంచి ప్రదేశాలలో కాలం గడపడం,  గర్భిణిలను స్నేహితులుగా మార్చుకోవడం వంటివి కూడా మేలు చేస్తాయి. 
–మేఘాజైన్, క్లినికల్‌ సైకాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, కొండాపూర్‌


 

మరిన్ని వార్తలు