Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే

21 Sep, 2022 17:45 IST|Sakshi

బతుకమ్మ అంటే ఒక సంబరం. ఒక సాంస్కృతిక వారసత్వం. ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. అందుకే బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతిలో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు పల్లె మహిళలు. 

తెలంగాణ జిల్లాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే ఇది. ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో భాగం. వారి జీవన విధానంలో మమేకమై ఆనాదిగా ఆచారంగా వస్తున్న పండుగే బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వారం, పది రోజులు ఒక్కటే సందడిగా మారుతుంది. కొత్త బట్టలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు.    

గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ ఇది. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలంలో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూలతో పాటు ప్రకృతిలో దొరికే ఏ పువ్వయినా బతుకమ్మలో పేర్చుతారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలకరించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువతానాన్ని నిలిపే గౌరవమ్మను భక్తిగా పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత.  

బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతూ ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు మహిళలు. బతుకమ్మ వెనుక ఎన్ని కథలున్నా.. ఎంత చరిత్ర ఉన్నా బతుకమ్మ అచ్చంగా మనదైన పండుగ, మన ఆడపడుచుల పండుగ.

మరిన్ని వార్తలు