మైగ్రేన్‌ వేధిస్తోందా? ఇలా చేయండి..

18 Feb, 2021 10:13 IST|Sakshi

ఎన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించినా ఏలోపం కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్‌. చాలామంది ఉద్యోగుల ఆఫీసు పనిగంటలూ, చాలామంది పిల్లల స్కూల్‌ అవర్స్‌ వృథా అయ్యేలా చేస్తుందీ మైగ్రేన్‌ సమస్య. సాధారణం మగపిల్లలతో పోలిస్తే అమ్మాయిల్లో ఇది ఎక్కువ. మైగ్రేన్‌కు కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

మైగ్రేన్‌ సమస్య ఉన్నవారి మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు, వాటి పరిమాణం అకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దాంతో ఆ పరిసరాల  నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ సమస్య వల్ల శరీరంలోని సింపాథెటిక్‌ నరాల వ్యవస్థ ఉత్తేజానికి గురికావడంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పినే మైగ్రేన్‌ అంటారు.

కారణాలు :
► తీక్షణమైన వెలుతురుకు ఎక్స్‌పోజ్‌ కావడం
► తీవ్రమైన మానసిక ఒత్తిడి
►నిద్రలేమి  తరచూ ఉపవాసాలుండటం
►హార్మోన్ల సమస్యలుసరిపడని వాసనలు
►ఆల్కహాల్‌ అలవాటు, పొగాకూ... దాని ఉత్పాదనలు వాడటం, పొగతాగడం
►ఎక్కువగా కాఫీ తాగడం లేదా కెఫిన్‌ ఉండే పదార్థాలు తీసుకోవడం
►మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్‌ హార్మోన్స్‌ ఎక్కువగా స్రవించడం వల్ల మైగ్రేన్‌ కనిపించవచ్చు. 

లక్షణాలు : తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది.
►తల బద్దలవుతున్నట్లుగా నొప్పి రావచ్చు. అది ఒక్కోసారి తలకు ఒకవైపు లేదా కొన్నిసార్లు రెండు వైపులా రావచ్చు.
►ఒక్కోసారి కళ్లచుట్టూ, కణతలో, తల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి రావచ్చు .తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు.
►రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి మరీ ఎక్కువవుతుంది
►కొందరిలో వికారం, వాంతులు కనిపించవచ్చు.
►మరికొందరిలో అరుదుగా విరేచనాలు కావచ్చు.
►ఇకొందరిలో ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం జరగవచ్చు.
►సాధారణంగా చాలామందిలో వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. 
►చిరాకు, నీరసం, ఉత్సాహాంగా లేకపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ∙తరచూ ఆవలింతలు కనిపిస్తుండవచ్చు. 

ముందస్తు హెచ్చరికలూ ఉంటాయి... 
►మైగ్రేన్‌ సమస్య ఉన్నవారిలో తలనొప్పి వచ్చేముందర  కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్‌ ఆరా అంటారు. అవి... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. 

జాగ్రత్తలివే...  ∙ఎక్కువ శబ్దాలూ, వెలుతురూ లేని గదిలో విశ్రాంతిగా పడుకోవాలి. ∙కంటినిండా నిద్రపోవాలి ∙మద్యం, పొగతాగే అలవాట్లు పూర్తిగా మానుకోవాలి. ∙కొవ్వుపదార్థాలు, తలనొప్పి ఉన్నప్పుడు ప్రోటీన్‌ ఫుడ్‌ అంటే  మాంసం, పప్పులు తగ్గించాలి ∙రోజూ తగినంత నీరు తాగాలి. ∙జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. ∙మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలూ, యోగా వంటివి అలవరచుకోవాలి. 

చికిత్స : మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. మళ్లీ మళ్లీ నొప్పి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. డాక్టర్లు ఈ రెండు రకాల మందులు వాడుతూ చాలావరకు మైగ్రేన్‌ను నియంత్రణలో ఉంచుతారు. అయితే ఇది తీవ్రమైన తలనొప్పి కలిగించినప్పటికీ చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఇది రావడం తగ్గిపోతుంది.  పైగా ప్రాణాపాయం లేని నిరపాయకరమైన సమస్య కావడం వల్ల దీనిపట్ల పెద్దగా ఆందోళన అక్కర్లేదు.

మరిన్ని వార్తలు