ఆన్‌లైన్‌లో డబ్బులు పోతే ఏం చేయాలి?!

16 Feb, 2023 03:11 IST|Sakshi

కూతురు పుట్టినరోజుకు డ్రెస్‌ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్‌ యాప్‌ ద్వారా పేమెంట్‌ చేసింది. అయితే, పేమెంట్‌ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్‌ అయినట్టు బ్యాంక్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది కానీ, షాప్‌ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్‌ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్‌ చేసింది. ఫెయిల్‌ అయిన ట్రాన్సాక్షన్‌ అమౌంట్‌ రిటర్న్‌ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్‌ అయిన మెసేజ్‌ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది.  

ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్‌ ఆధారిత పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్‌ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్‌లైన్‌ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్‌ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. 

ఫిర్యాదులకు వేదిక
సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్‌ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్‌ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్‌ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్‌లోడ్‌ చేయచ్చు.

ఇది ఆర్థిక సైబర్‌ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్‌ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్‌ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది.

CFCFRM టోల్‌ ఫ్రీ నెంబర్‌: 1930 
వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి కాల్‌ చేయాలి (12 గంటల్లోపు)
♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి, ఫిర్యాదు చేయాలి.
బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్, వాలెట్‌ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి.
♦ సమీపంలోని పోలీస్‌ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్‌ఐఆర్‌గా మార్చవచ్చు. 

RBI వన్‌ నేషన్‌ వన్‌ అంబుడ్స్‌మన్‌ : టోల్‌ ఫ్రీ నెం. 14448
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ‘వన్‌ నేషన్‌ వన్‌ అంబుడ్స్‌మన్‌ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్‌ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ అందించడం ఈ పథకం లక్ష్యం.

ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్‌బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్  ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్‌ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్‌ సంస్థలు కట్టుబడి ఉంటాయి.

దశల వారీగా నివేదించే ప్రక్రియ...
సంబంధిత యుపిఐ సర్వీస్‌ప్రొవైడర్‌ పేటీఎమ్, గూగుల్‌ పే, ఫోన్‌ పె మొదలైన వాటిపై ఫిర్యాదు.
టోల్‌ ఫ్రీ నంబర్‌ 14448కి కాల్‌ చేయాలి.
https://cms.rbi.org.in   పోర్టల్‌కు లాగిన్‌ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. 
మీ ఫిర్యాదును CRPC@rbi.org  కి ఇ–మెయిల్‌ చేయచ్చు. (బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ లావాదేవీ స్క్రీన్‌ షాట్‌లు / యుపిఐ, యాప్‌ లావాదేవీ స్క్రీన్‌ షాట్‌లు/ పంపిన, స్వీకరించిన ఫోన్‌ నంబర్లు రెండింటినీ జత చేయాలి)
♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్‌ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది.

డబ్బులు ఇరుక్కుపోతే.. 
డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్‌ నుంచి డిడక్ట్‌ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్‌ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. 
ప్రతి కస్టమర్‌ PSP యాప్‌ (పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు) / TPAPయాప్‌ (థర్డ్‌ పా ర్టీ అప్లికేషన్‌ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్‌ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు.

ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి..
(ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్‌ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్‌ కాలేదు
(బి) ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్‌ అయ్యింది
(సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది
(డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్‌ అయ్యింది
(ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది
(ఎఫ్‌) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది
(జి) లావాదేవీ అసలు యాక్సెస్‌ అవలేదు
(హెచ్‌) లావాదేవీ రిజక్ట్‌ అయ్యింది
(ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. 


- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,  డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌


 

మరిన్ని వార్తలు