చిన్నవయసులో ఆర్ధరైటిస్‌.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి

20 Aug, 2021 20:27 IST|Sakshi

ముందు జాగ్రత్తే అసలైన మందు

జీవనశైలిలో మార్పు అవసరం

కాల్షియంతో ఎముకలకు బలం

అడుగు కదిలితే నరకం చూపే నొప్పి, ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది, వయసుతో సంబంధం లేకుండా అందరినీ పీడిస్తుంది.. అదే ఆర్ధరైటిస్‌ లేదా కీళ్లవాతం! పూర్వం వయసు మళ్లిన వారు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. నేడు చిన్నవయసులో సైతం ఈ వ్యాధి వస్తోంది. వయసు పైబడినవారిలో మోకాళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్‌ వస్తుంది. మరి చిన్నవయసులో ఎందుకు వస్తుందంటే.. అనేక కారణాలున్నాయి.

డెంగ్యూ, చికున్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ లాంటి వైరల్‌ జ్వరాలు సోకితే వచ్చిన కీళ్ల నొప్పులు ఏడాదిపాటు ఉంటున్నాయి. అలా కాకుండా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం, అనవా సరమైన వ్యర్థాలు పెరగడం, జన్యులోపాల వల్ల వచ్చే కీళ్లవాతం దీర్ఘకాలం ఉంటుంది. ఇవే కాకుండా  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్, జీవక్రియ లోపం, హార్మోన్స్‌ అసమతుల్యత, థైరాయిడ్‌ ప్రభావం, సొరియాసిస్, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్‌ అనే ద్రవంలో తేడాలు ఏర్పడటం, అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పులు, గాయాలు తగిలినపుడు లిగమెంట్, కార్టిలేజ్‌ దెబ్బతినడం, జాయింటుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు,డిస్‌లొకేషన్, సికిల్‌ సెల్‌ డిసీజ్, బోన్‌ ట్యూమర్స్, బ్లీడింగ్‌ డిజార్డర్స్‌ వంటివన్నీ కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలవుతాయి. 
చదవండి: ఇకపై క్యాన్సర్‌తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు! 

పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపించినా, ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కీళ్లవాతం గుర్తించడం తేలికైన పనే. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ జాయింట్ల వద్ద నొప్పులు ఉంటే అది కచ్చితంగా కీళ్లవాతమే అని భావించాలి. జాయింట్ల వద్ద నొప్పులు, వాపులు ఉంటే ఈ లక్షణంగానే గుర్తించాలి. నిద్రలేచిన తరువాత జాయింట్ల వద్ద నొప్పులు, నడవలేని, లేవలేని పరిస్థితి కనిపిస్తుంది. జ్వరం తగ్గిన తరువాత కీళ్లనొప్పులు కొనసాగినే ఆర్ధరైటిస్‌గా అనుమానించాల్సిందే. కీళ్లవాతంలో అనేక రకాలున్నాయి.
చదవండి: సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే!

గౌట్‌
ఈ తరహా కీళ్లవాతానికి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం ప్రధాన కారణం. ముఖ్యంగా జాయింట్స్‌ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్‌ యాసిడ్‌ పేరుకుపోవడంతో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. పెరుగుతున్న యూరిక్‌ యాసిడ్‌ను శరీరం బయటకు పంపించలేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. చీలమండలు, కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో జాయింట్లు వాపు, నొప్పితో ఎర్రగా మారుతాయి.

సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌
సొరియాసిస్‌ అనే చర్మ వ్యాధి కారణంగా తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. ఈ ప్యాచ్‌లు లేదా మచ్చలు చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గరకు విస్తరించినపుడు సొరియాటిస్‌ ఆర్థరైటిస్‌ ప్రారంభమవుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. చేతి వేళ్లలోనూ, కాలి వేళ్లలోనూ నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్‌ వస్తుంది.

రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌
ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసార్డర్‌ అంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వస్తుంది. చలి కాలంలో దీని బాధ ఎక్కువ. ఈ వ్యాధి చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల  ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. ఇది  వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.

అంకైలోజింగ్‌ స్పాండిలోసిస్‌
వెన్నెముకలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్రమంగా నొప్పి విస్తరిస్తుంటుంది. కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.

అస్టియో ఆర్థరైటిస్‌
వయసు పెరుగుతున్నకొద్దీ కార్టిలేజ్‌ అరిగిపోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్‌ వస్తుంది. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్‌ అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. దీని వల్ల కూర్చొని లేచినప్పుడు, ఉదయం పూట లేచినప్పుడు జాయింట్లు పట్టినట్టుగా ఉంటాయి. మొదట పది అడుగులు కూడా నడవడానికి వీలుండదు. నడుస్తుంటే కీళ్లలో టకటకమనే శబ్డం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మోకాలులో ఈ నొప్పి కనిపిస్తుంది. రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలలో , వయసు మళ్లినవారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కనిపిస్తుంతది. కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది.

కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ద్వారా ఏ కారణం వల్ల ఏయే కీళ్ళు దెబ్బతిన్నదన్న విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలామంది కీళ్ళనొప్పులకు ఆపరేషన్‌  తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్‌ లేకుండా ఆయుర్వేదం, హోమియోల్లో మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి విషమిస్తే  కృత్రిమ కీళ్లమార్పిడి చేస్తున్నారు. తుంటి ఎముక బాల్, యాంకిల్‌ జాయింట్, షోల్డర్‌ జాయింట్, చేతివేళ్ల జాయింట్లకు కూడా చికిత్సలున్నాయి. అంతేకాకుండా ఆరు నుంచి ఏడాదిలోపు ఇంజక్షన్ల ద్వారా ఈ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి. అయితే ఈ  మందులు ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉన్నందున డాక్టరు సలహా మేరకే వాడాలి. వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించడం వల్ల ఆర్ధరైటిస్‌ను ఆమడ దూరంలో ఉంచవచ్చు. 
∙డి. శాయి ప్రమోద్‌

ఆర్ధరైటిస్‌ను ఇలా అదుపు చేద్దాం!
 కీళ్లవాతాన్ని అరికట్టడంలో కింద పేర్కొన్న మార్గాలు సత్ఫలితాలిస్తాయి. 
► కాల్షియం అధికంగా ఉండే పదార్థాలైన పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా వస్తువులు, అధిక బరువును తగ్గించుకోవాలి.  
► కాపడుకునేటప్పుడు మోకాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి. అధిక బరువులు ఎత్తకూడదు. 
► కాపంచదారతో చేసే క్యాండీ, సోడా, ఐస్‌క్రీమ్‌ వంటి ఆహారాలను తీసుకోకూడదు. 
► కాప్రాసెస్‌ చేసిన రెడ్‌ మీట్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల రెడ్‌ మీట్‌కు దూరంగా ఉంటేనే మంచిది. 
► కాగ్లుటెన్‌ అధికంగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్‌ సెరల్స్, రిఫైన్‌ గ్రెయిన్స్‌, ప్రిజర్వేటివ్‌ రసాయనాలు కలిపినవి కూడా తీసుకోకూడదు.
► కామద్యం అలవాటు ఉన్నవారు ఆల్కహాల్‌ను మానేయాలి. లేదంటే వెన్నెముకపై ప్రభావం పడి పెళుసుగా మారుతుంది.  

మరిన్ని వార్తలు