అకస్మాత్తుగా గుండె పట్టేయడం.. గుండెపోటుతో చనిపోతాననే భయం! ఎందుకిలా? సమస్య ఏమిటంటే..

2 Jan, 2023 15:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 Panic Attacks: సంతోష్‌ పేరుకు తగ్గట్టే నిత్యం సంతోషంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాలుగా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉంటూ బాగా సంపాదించాడు. తనకంటూ సొంతకారు కొనుక్కున్నాక, సొంత ఇల్లు కట్టుకున్నాకే నిత్యను పెళ్లి చేసుకున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఒకరోజు కారులో సైట్‌కు వెళ్తున్న సమయంలో గుండె పట్టేసినట్లనిపించింది. లైట్‌గా తీసుకున్నాడు.

మరో నెల తర్వాత నిద్రపోతుండగా అదే రిపీట్‌ అయ్యింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలిశాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాక ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించాడు. కానీ మరో నెల తర్వాత బిజినెస్‌ మీటింగ్‌లో ఉండగా అదే పరిస్థితి రిపీట్‌ అయ్యింది. గుండెపోటు వచ్చిందేమోనని తీవ్రంగా భయపడ్డాడు, వణికిపోయాడు.

మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లి అన్ని పరీక్షలూ చేయించుకున్నాడు. ఎలాంటి సమస్యా లేదన్నారు. కానీ గుండెపోటుతో చనిపోతాననే భయం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఏమవుతుందోనని వణికిపోతున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇలా అకస్మాత్తుగా భయాందోళనలతో మనసు, శరీరం అతలాకుతలం కావడాన్ని పానిక్‌ అటాక్స్‌ అంటారు. 

కారణాలు తెలియవు..
ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం పోరాడతాం లేదా పారిపోతాం. అది శరీరపు సహజ స్పందన. అలాంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది. పానిక్‌ అటాక్స్‌లో కూడా అలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి.

స్పష్టమైన ప్రమాదం లేకున్నా అలా ఎటాక్స్‌ ఎందుకు వస్తాయో కారణాలు తెలియవు. కానీ జీన్స్‌, ఒత్తిడి, ఒత్తిడి వల్ల తీవ్ర ప్రతికూల భావోద్వేగాలకు గురయ్యే స్వభావం, మెదడులోని భాగాల పనితీరులో మార్పులు కారకాలుగా గుర్తించారు. 

పానిక్‌ అటాక్స్‌ లక్షణాలు..
►పానిక్‌ అటాక్స్‌కు గుండె వేగంగా కొట్టుకోవడం ఒక్కటే కాదు ఇంకా అనేక లక్షణాలున్నాయి.
►ఒళ్లంతా వణుకుతుంది, చెమటలు పడతాయి.
►శ్వాస వేగవంతమవుతుంది లేదా ఆగిపోయినట్లనిపిస్తుంది.
►ఒళ్లంతా వేడి సెగలు, వేడి ఆవిరులు వస్తాయి.

►తలనొప్పి, తల తిరగడం, మైకం లేదా మూర్ఛపోవచ్చు.
►మరణభయం వెంటాడుతుంది.
►ఈ అటాక్స్‌ జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తాయి.
►డ్రైవింగ్‌ చేయాలన్నా, ఇల్లు వదిలి వెళ్లాలన్నా భయం వెంటాడుతుంది.
►తరచూ హాస్పిటళ్ల చుట్టూ తిరగడం పెరుగుతుంది.

►పదిమందిలో కలవడాన్ని నిలిపేస్తారు. దీనివల్ల పనిలో సమస్యలు ఎదురవుతాయి.
►డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలూ రావచ్చు.
►ఆత్మహత్య ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంది.
►భయాన్ని అధిగమించేందుకు మద్యం వినియోగం పెరుగుతుంది.
►మొత్తంమీద జీవితం దుర్భరంగా మారుతుంది. 

తరచూ వస్తుంటే డిజార్డర్‌
►పానిక్‌ అటాక్స్‌ తరచుగా వస్తుంటే దాన్ని పానిక్‌ డిజార్డర్‌ అంటారు. ఈ డిజార్డర్‌ ఉన్నవారికి ఒకసారి అటాక్‌ రాగానే, మరొక అటాక్‌ వస్తుందేమోననే ఆందోళన నెల లేదా అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతుంది. 

►గుండెపోటు వస్తుందేమోననే భయాందోళనలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల అటాక్స్‌కు కారణమని భావించే పరిస్థితులను పూర్తిగా అవాయిడ్‌ చేస్తారు. ప్రవర్తనలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా టీనేజ్‌ చివరిలో లేదా యుక్తవయస్సులో ప్రారంభమవుతాయి.ఇవి  పురుషుల కంటే  స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

ఎవరికి వస్తుందంటే..
►కుటుంబంలో ఎవరికైనా పానిక్‌ డిజార్డర్‌ ఉన్నప్పుడు
►తీవ్ర అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, శారీరక, లైంగిక వేధింపులు, సీరియస్‌ యాక్సిడెంట్‌ లాంటి తీవ్ర ఒత్తిడి కలిగించే సంఘటనలు
►విడాకులు లేదా బిడ్డను కనడం వంటి మేజర్‌ మార్పులు
►ధూమపానం లేదా అధిక కెఫీన్‌ తీసుకోవడం

ఏం చేయాలి?
►రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండండి
►పగటిపూట మగతగా అనిపించకుండా తగినంత నిద్రపోండి
►మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, డీప్‌ బ్రీతింగ్, జాకబ్సన్‌ రిలాక్సేషన్‌ లాంటివి ప్రాక్టీస్‌ చేయండి
►కాఫీ, మద్యం, ధూమపానం, డ్రగ్స్‌ మీ పానిక్‌ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి
►యాంగ్జయిటీ, పానిక్‌ డిజార్డర్‌ ఉన్న వ్యక్తులతో ఏర్పడిన సపోర్ట్‌ గ్రూపులో చేరండి

►అప్పటికీ మీ భయాందోళనలు తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవండి
►మీకు వచ్చే అటాక్స్‌ ప్రాణాంతకం కాదని తెలుసుకోవడానికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ సహాయపడుతుంది
►థెరపీ వల్ల మీకు కొన్ని వారాల్లోనే రిలీఫ్‌ రావచ్చు.
►రిలీఫ్‌ వచ్చేసిందని థెరపీ ఆపేయకుండా సైకాలజిస్ట్‌ చెప్పిన ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండండి.

►మీ డిజార్డర్‌ నుంచి పూర్తిగా బయటపడేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు
►మీ డిజార్డర్‌ తీవ్రంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి, ఆయన ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. 
-సైకాలజిస్ట్‌ విశేష్‌
చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి?

మరిన్ని వార్తలు