PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా! మరెలా బయటపడాలి?

7 Feb, 2023 15:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెంటాడి వేధించే జ్ఞాపకాలు

రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్‌ అడిగినా, ఫ్రెండ్స్‌తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్‌ సలహాపై పేరెంట్స్‌ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. 

తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది

తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్‌గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్‌కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్‌ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. 
∙∙∙ 
కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి.

ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (PTSD) అంటారు. 

పీటీఎస్‌డీ లక్షణాలు..
►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి.
►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు.
►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙
►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి.

►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙
►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్‌ విజిలెన్స్‌ ఉంటాయి. 
►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్‌ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి.
►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్‌డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ని, డిఫెన్స్‌ సిస్టమ్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. 

ఏం చెయ్యాలి? 
►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్‌డీగా మారుతుంది. దీన్ని డీల్‌ చేయడంలో ముందుగా పేరెంట్స్‌కి కౌన్సెలింగ్‌ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్‌ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్‌ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. 

►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్‌కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి
►పీటీఎస్‌డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్‌ బాల్స్‌ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్‌ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్‌ఫుల్‌ నెస్‌ ప్రాక్టీస్‌ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్‌ అనే పదాన్ని మనసులో చూడండి

►కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ, ఎక్స్‌పోజర్‌ థెరపీ, ఐ మూవ్‌ మెంట్‌ డిసెన్సిటైజేషన్‌ అండ్‌ రిప్రాసెసింగ్‌((EMDR)), ట్రామా–ఫోకస్డ్‌ కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్‌ సైకోథెరపీలోని  VK Dissociation  టెక్నిక్‌ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది.
►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్‌ పిల్స్‌ వాడవచ్చు.  

చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్‌ ఎక్కడుందో తెలుసా?

మరిన్ని వార్తలు