Health: డెలివరీ తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు! కారణమేంటి?

6 Jan, 2023 19:14 IST|Sakshi

డాక్టర్‌ సలహా

Postnatal Stress Disorder: మా అక్క రీసెంట్‌గా డెలివరీ అయింది. నార్మల్‌ డెలివరీకి చాలా ట్రై చేశారు. హఠాత్తుగా బేబీ హార్ట్‌ బీట్‌ తగ్గడంతో వెంటనే ఆపరేషన్‌ చేశారు. డెలివరీ అయినప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.

కంగారుగా ఉంటోంది. నిద్ర పోవడం లేదు. కోపమూ ఎక్కువైంది. అగ్రెసివ్‌గా బిహేవ్‌ చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. ప్రసవం తర్వాత సహజంగానే ఇలా ప్రవర్తిస్తారా? – రమణి

మీరు చెప్పినదాన్ని బట్టి తనకి యాంగ్జైటీ ఉన్నట్టుంది. మామూలుగా డెలివరీ టైమ్‌లో చాలా మార్పులు ఉంటాయి. హార్మోన్స్‌ చేంజెస్‌ ఉంటాయి. డెలివరీ హఠాత్తుగా కాంప్లికేట్‌ అయినా, వాళ్లు ఊహించినట్లు కాకపోయినా, బర్త్‌ ట్రామాతో మానసికంగా డిస్టర్బ్‌ అవుతారు. దీనిని పీఎన్‌ఎస్‌డీ.. పోస్ట్‌నాటల్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అంటారు. దీన్ని ఎమోషనల్‌ కేర్, సపోర్ట్‌తో సంభాళించాలి.

చాలామందికి మందుల అవసరం ఉండదు. కొంతమంది తమ ప్రసవం తాలూకు విషయాలను పదే పదే గుర్తుతెచ్చుకుంటూ.. అదే పునరావృతమవుతున్నట్టు భావిస్తారు. దీనివల్ల చురుకుదనం, బిడ్డ మీద శ్రద్ధ, ఆత్మవిశ్వాసమూ తగ్గుతాయి. తమను తామే నిందించుకునే స్థితిలోకి వెళ్లిపోతారు. వీళ్లకు టాకింగ్‌ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది.

ప్రసవమప్పుడు జరిగిన అనుకోని సంఘటలను వాళ్ల మెదడు యాక్సెప్ట్‌ చేయడానికి ఈ టాకింగ్‌ థెరపీ దోహదపడుతుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఈ థెరపీ గురించి చెప్తారు. ఏ సమయంలో వాళ్ల మూడ్‌ చేంజ్‌ అవుతోందో గమనించాలి. కొన్ని తేదీలు.. వాసనలు.. మనుషులను చూసినప్పుడు పాత విషయాలు, ఎక్స్‌పీరియెన్సెస్‌ గుర్తుకువచ్చి డిప్రెస్‌ అవుతారు.

డిప్రెషన్‌ ఎక్కువగా ఉంది అంటే దానికి సంబంధించి మందులు వాడాలి. కొన్నిసార్లు నమ్మకం ఉన్నవారితో తమ ఆలోచనలను షేర్‌ చేసుకొమ్మని సూచిస్తాం.  చాలాసార్లు కౌన్సెలింగ్‌తో సమస్యను పరిష్కరించవచ్చు. పాత అనుభవంతో కొంతమందికి భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ అంటేనే భయం పట్టుకోవచ్చు. అందుకే సమస్య కొంచెంగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ విధమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి అనేది నిర్ణయించవచ్చు. 
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు