వానలొస్తున్నాయ్‌.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

11 Jun, 2021 21:02 IST|Sakshi

తొలకరి చినుకులకు ప్రకతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అణగారిఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే!వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్‌ వరకుఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం, ఈ క్లైమేట్‌ ఛేంజ్‌తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

రకరకాల రోగాలు...
వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే! ఇది వైరల్‌ ఇన్ఫెక్షన్లలో అత్యంత కామన్‌ ఇన్ఫెక్షన్‌. ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ, నిమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది. వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది. వీటి కారణంగా మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ప్రబలుతాయి. ∙వానలతో గ్రౌండ్‌వాటర్‌లో, ఉపరితల నీటివనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి నీటిలో బాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి. ఇలాంటి కలుషిత జలాలతో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌లాంటి రోగాలు విజృంభిస్తాయి. కొత్తనీరు, పాతనీరు కలయికతో పెరిగే ఫంగస్‌ కారణంగా కొన్నిరకాల చర్మరోగాలు కలుగుతాయి.

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ పనిపట్టే ఔషధాలు ఇవే

వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది?
వేడి వేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి, వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాల్లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలావరకు తగ్గింది. నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజనల్‌ వ్యాధులే ఎక్కువ డేంజరని చెబుతున్నారు. వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని, అందువల్ల సీజనల్‌ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్‌ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా.

అయితే ఇది పూర్తిగా నిజం కాదని, కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్‌ చేయగలవు కానీ పూర్తి గా తొలగించలేవని డెలావర్‌ ఎపిడమాలజీ డిపార్ట్‌మెంట్‌ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వైరస్‌ సంగతేమో కానీ వాననీటితో బాక్టీరియా పెరుగుతుందని, ఇది కొత్త రోగాలను తెస్తుందని చెప్పారు. వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని, సీజనల్‌ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని, అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటింటి చిట్కావైద్యాలు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలు పాలు, పసుపు నీళ్ల ఆవిరి లాంటివి. సో... తగిన ముందు జాగ్రత్తలు తీసుకొంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే!

ఏం చేయాలి...
ప్రివెన్షన్‌ ఈజ్‌  బెటర్‌ దెన్‌ క్యూర్‌.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వర్షాకాలంలో వచ్చే జబ్బులబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే  మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్‌లో సప్తసూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్‌ రోగాలకు చెక్‌ పెట్టవచ్చు.

► ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి.
►దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్‌ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. 
►వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది, తర్వాత వచ్చేరోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి.
►ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు.
►ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్‌ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టైనా దోమలను తరిమేయాలి.
►చలిగా ఉందని బద్దకించకుండా రోజూ రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.
►చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్‌ చేయకుండా జాగ్రత్త పడాలి.

మరిన్ని వార్తలు