ప్రీ–హైపర్‌టెన్షన్‌ దశ అంటే..?

11 Feb, 2021 09:51 IST|Sakshi

ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం ఒక నిర్దిష్టమైన రీతిలో, కొంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేగం కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్లనే  సాధ్యమవుతుంది. రక్తాన్ని  గుండె పంప్‌ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్‌) లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్‌)ను ‘సిస్టోలిక్‌ ప్రెషర్‌’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్‌ ప్రెషర్స్‌ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్‌ ప్రెషర్‌ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ఇక ఇప్పుడు ప్రీ–హైపర్‌టెన్షన్‌ అంటే ఏమిటో చూద్దాం. 

ప్రీ–హైపర్‌టెన్షన్‌ 
సాధారణంగా డాక్టర్‌ దగ్గరికి రోగి వెళ్లగానే కొలత రక్తపోటును పరిశీలిస్తారు. ఒకవేళ అది 120/80 ఉంటే ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంత మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్‌ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్‌’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్‌’ దశ భవిష్యత్తులో ‘హైబీపీ’కి దారితీయవచ్చు.

వెసులుబాటు ఇదే... 
ప్రీ–హైపర్‌టెన్షన్‌లో రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని జాగ్రత్త చర్యలను మొదలుపెట్టవచ్చు. అంటే కేవలం మన జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు మనకు ఉంటుందన్నమాట. 
చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా..
వంటలూ వడ్డింపులతో క్యాన్సర్‌ నివారణ

తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... 
రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక నష్టాలు మనకు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తేలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే నష్టం అలా జరుగుతూపోయి ఏవైనా అవయవాలు దెబ్బతిన్న లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనకు హైబీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే వయసు నలభై దాటిన వారు అప్పుడప్పుడూ తమ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. 

ప్రీ–హైపర్‌టెన్షన్‌ దాటి ఇక బీపీ నిర్ధారణ ఇలా... 
బీపీ ఉన్నట్లుగా నిర్ధారణ కోసం తరచూ రక్తపోటును చెక్‌ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపే కొలతలు రెండు / మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు  వస్తే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడిక ప్రీ–హైపర్‌టెన్షన్‌ విషయాన్ని మరచిపోయి... తప్పక బీపీ నియంత్రణ మందులను డాక్టర్‌ సూచించిన విధంగా వాడాలి. 

హైబీపీకి కారణాలు 
ఇక పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబచరిత్ర, ఒకే చోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఎప్పుడూ పొటాషియమ్‌ ఎక్కువగా ఉండేలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమిలే అలవాటు, మద్యం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్‌ ఫ్యాక్టర్లు. 

మనందరికీ రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌ అంటే తెలుసు. కానీ రక్తపోటు వచ్చేందుకు ముందు మన దేహం కొన్ని హెచ్చరికలు చేస్తుంటుంది. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు రక్తపోటును నివారించడమో లేదా మరింత ఆలస్యంగా వచ్చేలా జాగ్రత్తపడటమో చేయవచ్చు. అలా హెచ్చరించే ఆ దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్‌’ దశగా చెప్పవచ్చు. ప్రీ హైపర్‌టెన్షన్‌ దశలోనే జాగ్రత్త పడితే మనం మనకెన్నో ఆరోగ్య అనర్థాలూ, కిడ్నీ, బ్రెయిన్‌ లాంటి కీలక అవయవాలు దెబ్బతినే పరిస్థితిని నివారించవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్‌’ దశపై అవగాహన కోసమే ఈ కథనం. 

ఈ జాగ్రత్త తీసుకోండి
అంతగా హైబీపీ లేకుండా కేవలం ప్రీహైపర్‌టెన్షన్‌ ఉన్నప్పుడు... అది ప్రమాదకర దశ కాదని రిలాక్స్‌ కాకూడదు. అది పంపే  హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.
-డాక్టర్‌ సౌమ్యబొందలపాటి, కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

పైల్స్‌ నివారణ ఇలా : మొలల లక్షణాలు అంతగా బాధించని స్థితినుంచి మేల్కొని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిని సమర్థం గా నివారించవచ్చు. పైగా ఇది మంచిది కూడా. దీనివల్ల బాధాకరమైన పరిస్థితులను, చికిత్సను తప్పించుకోవచ్చు. 

► మలబద్దకం లేకుండా చూసుకుంటూ విసర్జన సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ∙మలబద్దకం లేకుండా ఉండటం కోసం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, పొట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు నీళ్లు పుష్కలంగా తాగాలి. ∙మలబద్దకానికి ఆస్కారం ఇచ్చే పచ్చళ్లు, మసాలాలు, వేపుళ్లు, కారం, బేకరీ ఐటమ్స్‌ అయిన పిజ్జా, బర్గర్ల వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ∙చాలాసేపు కూర్చుని చేయాల్సిన వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి పదినిమిషాలు తిరిగి మళ్లీ కూర్చోవాలి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు