What Is Vertigo: సుబ్బారావుకు గుండెదడ తగ్గలేదు.. అసలేమిటీ వర్టిగో! తీవ్రమైన రక్తహీనత, మెదడులో కంతులు.

7 Dec, 2021 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

What Is Vertigo: Symptoms Causes Diagnosis Types Treatment: చాలా సేపటినుంచి కదలకుండా సీటులో కూర్చుని సీరియస్‌గా పని చేసుకుంటున్న సుబ్బారావుకు తల దిమ్ముగా అనిపించింది. తల విదిలించాడు. కాఫీ తాగొస్తే బాగుంటుందనుకున్నాడు. సీటులో నుంచి లేచి నెమ్మదిగా రెండడుగులు వేశాడు. కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించింది. విపరీతంగా తల తిరుగుతోంది. ముందుకు తూలి పడబోయాడు. పక్క సీటులోనే ఉన్న రాజుకు సుబ్బారావుకు ఏమి జరుగుతోందో తెలియదు కానీ, అతడు పడబోవడం చూసి గభాల్న పట్టుకున్నాడు.

సుబ్బారావుకు గుండెదడ తగ్గలేదు. ‘ఏమైంది, ఎందుకు పడబోయావ్‌?’ అని అడుగుతున్న రాజు మాటలకు సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఏమయిందోనని కంగారుతో అటూ ఇటూ కుదుపుతూ ‘సుుబ్బారావ్‌... సుబ్బారావ్‌’ అని అరిచాడు. ఈ హడావుడికి సెక్షన్‌లోని వారంతా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. ఎవరికి తోచిన సలహా వారు ఇవ్వసాగారు. 

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తల తిరగడం. సహజంగా కొంత మందికి తల తిరిగి, వాంతి వచ్చినట్లుగా ఉందని అంటుంటారు. దీన్నే వైద్య పరిభాషలో ‘వర్టిగో’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేక భయపడుతుంటారు. చూడటానికి ఇది చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ అనుభవించేవారి బాధ అంతా ఇంతా కాదు. వర్టిగోకి అనేక కారణాలుంటాయి. అవేమిటో తెలుసుకుంటే చికిత్స చాలా సులువు అవుతుంది. 

కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి ఇవి సాధారణమే అయినా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు రావడానికిది ముందస్తు సూచనగా భావించవలసి ఉంటుంది. కనుక ఎప్పుడైనా కళ్లు తిరిగినా, ఒళ్లు తూలినా దానికి కారణాలను తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలి. 

కారణాలు
►వ్యాధుల వలన కలిగే తల తిరుగుడు, తలకు పెద్ద గాయం అవడం
►లోపలి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవ లోపం, లోపలి చెవి శస్త్రచికిత్స అనంతరం 
►యూస్టాషియన్‌ గొట్టం మూసుకుపోవడం 
►మెడ ఎముకలు అరుగుదల లాంటివి ఏర్పడినపుడు తల తిరుగుడు ... కళ్లు తిరగడం కనిపిస్తుంది.
►కంటి చూపులో పవర్‌లో మార్పులు
►రక్తపోటు అస్తవ్యస్తం (అధిక రక్త పోటు/బి.పి. తగ్గుట)
తీవ్రమైన రక్తహీనత
►మెదడులో కంతులు
►తీవ్ర మానసిక వత్తిడులు
►పక్క నుండి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుండి పక్కకు తిప్పినా తల తిరుగుడు వస్తుంది. (పొజిషనల్‌ వర్టిగో)

వ్యాధి నిర్ధారణ పరీక్షలు
►చెవి పరీక్ష
►ఆడియాలజీ పరీక్షలు
►వెస్టిబ్యులర్స్‌ పరీక్షలు
►రక్త పరీక్షలు
►మధుమేహం
►కొవ్వు (కొలస్ట్రాల్‌) పరీక్షలు
►హెచ్‌.ఐ.వి. పరీక్షలు
►మెడ ఎక్స్‌రే
►ఈసిజి ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశితంగా పరీక్షించాలి.
►రోగానికి గల కారణం నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేయాలి. మొట్టమొదట రోగికి ధైర్యం చెప్పాలి. కారణం తెలుసుకున్నాక కొన్ని యాంటీ వర్టిగో మందులతో, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించవచ్చు. ►అయితే మెదడులో కంతుల వంటి వ్యాధులకు మాత్రం శస్త్ర చికిత్స అవసరమౌతుంది. 
చదవండి: కరోనా రీ–ఇన్ఫెక్షన్‌ గనుక వస్తే..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!

గుండె సంబంధమైనవి
అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై పీడన ఏర్పడినప్పుడు, రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి తల తిరగడం జరుగుతుంది.
చికిత్స: మూలకారణమైన అధిక రక్తపోటును తగ్గించే మందులు వాడాలి. కొవ్వు పదార్థాలు తగ్గించే స్టాటిన్స్‌ వాడటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

చెవి, ముక్కు, గొంతు
చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోనూ, రక్త సరఫరాలోనూ, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వల్ల చెవిలో మీనియర్స్‌ వ్యాధి, వర్టిగో ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది.
చికిత్స: ఇఎన్‌టి వైద్యనిపుణులను సంప్రదించి ‘స్టిరాయిడ్‌’ వైద్యం, సినర్జిన్‌ వంటి మందులు వాడాలి.

ఆర్థోపెడిక్‌: మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రసరించే రక్తం మెడ ముందు భాగంలోని రెండు కెరోటాడ్‌ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా రెండు సర్వైకల్‌ వెర్టిబ్రల్‌ రక్త నాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనక భాగానికి రక్తాన్నందిస్తాయి. మెడలోని ఎముకల అరుగుదలలో ఈ రక్త నాళాలు ఒక్కోసారి ఒత్తిడికి లోనై మెదడుకు సరఫరా అయ్యే రక్తం తగ్గినప్పుడు, నిద్ర నుండి లేవగానే తల తిరిగి పడిపోతుంటారు.

చికిత్స: దీనికి కాలర్, ట్రాక్షన్‌ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి.
అన్నిటికీ మించి తనకేదో ప్రమాదకరమైన జబ్బు వచ్చిందేమోననే అపోహను వీడాలి.

చదవండి: Health Tips: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..

మరిన్ని వార్తలు