నడుస్తూ ధ్యానం చేయవచ్చని తెలుసా?!

12 Jan, 2021 08:47 IST|Sakshi

మెడిటేషన్‌వాక్‌తో లాభాలెన్నో! 

ధ్యానం.. మనలోని అనవసర ఆందోళనలు, భయాలు మాయం చేసిమనసుకు ప్రశాంతత చేకూర్చే చక్కని మార్గం. అందుకే భారతీయసంప్రదాయంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుషులు, మునులుసదా అనుసరించేదిదే. అలాగే బుద్ధిజంలోనూ దీని పాత్ర అధికం. చక్కని వాతావరణంలో పద్మాసనం వేసుకొని కూర్చొని కాసేపు కళ్లు మూసుకొని అన్నింటినీ మరచిపోయి శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా ఎక్కువ మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్‌ వాక్‌) ఉందనే విషయం అందరికీ తెలీదు. వాకింగ్‌ మెడిటేషన్‌ను బౌద్ధంలో ‘‘కిన్హిన్‌ ’’అంటారు. దీనికే ‘సూత్ర వాక్‌’ అని మరోపేరుంది. జెన్‌ మెడిటేషన్, ఛన్‌ బుద్ధిజం, వియత్నమీస్‌ థైన్‌ తదితర విభాగాల్లో మెడిటేషన్‌ వాక్‌ ఒక భాగంగా భావిస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసే బదులుగా మధ్య మధ్యలో ఇలా వాకింగ్‌ మెడిటేషన్‌నూ చేస్తారు. కిన్హిన్‌ అనేది జాజెన్‌కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ.

ఎలా చేస్తారు?
మెడిటేషన్‌ వాక్‌లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్‌వైజ్‌ డైరక్షన్‌లో నెమ్మదైన అడుగులు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతారు. ఒక్కో అడుగుకు ముందు ఒక బ్రీత్‌(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్‌ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్ధం. అంటే మనం ప్రశాంతత గుండా ప్రయాణించడమని అర్ధం చేసుకోవచ్చు. 

ఉపయోగాలు: 
1. రక్తప్రసరణ మెరుగుపర్చడం
తరచూ వాకింగ్‌ మెడిటేషన్‌ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవడంలో తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది. అంతేకాదు శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది.

2. జీర్ణశక్తిని పెంచుతుంది
ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. అంతేకాదు మలబద్ధకం నివారిస్తుంది. 

3. ఒత్తిడి తగ్గిస్తుంది
ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని చేసే ధ్యానం కన్నా నడుస్తూ చేసే ధ్యానంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. 2017లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మధ్య వయస్కుల్లో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు వాకింగ్‌ మెడిటేషన్‌ ద్వారా సమర్థంగా తగ్గినట్లు తేలింది. అయితే, కనీసం 10 నిమిషాల సమయం మెడిటేషన్‌ వాక్‌ చేయాల్సి ఉంటుంది.  

4. చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది
టైప్‌ 2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిల్ని బౌద్ధంలోని ఓ మెడిటేషన్‌ వాక్‌ ప్రక్రియ సమర్థంగా నియంత్రించినట్లు 2016లో వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వారానికి మూడుసార్లు రోజూ కనీసం అరగంట చొప్పున సాధారణ వాకింగ్‌ చేసేవాళ్లతో పోలిస్తే బౌద్ధ మెడిటేషన్‌ వాక్‌ చేసిన వాళ్లలో మధుమేహం నియంత్రణ, చక్కటి రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించారు.   

5. డిప్రెషన్‌ తొలగిస్తుంది
2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్‌ వాక్‌ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్తప్రసరణ, ఫిట్నెస్‌ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యుక్తవయసువారు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఈ బౌద్ధ మెడిటేషన్‌ వాక్‌ ప్రక్రియను వారానికి కనీసం మూడుసార్లు చొప్పున 12 వారాల పాటు వారు అనుసరించారు.  

6. ఆరోగ్యాన్ని పెంచుతుంది
ప్రకృతి(ఏదైనా పార్క్‌/తోట/ వనం)లో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సమతుల స్థితి చేకూరుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్‌ వాక్‌ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితోపాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత తదితర వాటినీ మెడిటేషన్‌ వాక్‌ మెరుగుపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు