గింజనే చూస్తే.... గింజవయిపోతావు

6 Nov, 2023 03:41 IST|Sakshi

వాగ్గేయకార వైభవం

‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు.  ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. 

అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య.

ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి.

నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు.

అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది.

అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు  చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు.  మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు.
 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు