పిల్లల్లో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్ల వలయం? 

24 Apr, 2022 13:36 IST|Sakshi

పెద్ద వయసు వాళ్లలో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం రావడం మామూలే. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోని చాలామందిలో ఇది కనిపిస్తుంది. కానీ పిల్లల్లోనైతే ఇది రావడానికి వాతావరణ కాలుష్యం ఓ కారణమనీ, దాంతో వచ్చే అలర్జీ కారణంగానే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.  సాధారణంగా ఆరుబయట తిరుగుతూ దువు్మూ ధూళి, ఆరుబయటి కాలుష్య, పుప్పొడి వంటి వాటికి నిత్యం ఎక్స్‌పోజ్‌ అవుతున్నప్పుడు... ఏదైనా అంశంతో అలర్జీ కలిగితే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా కార్నియా చుట్టు తెల్లవలయం రావడాన్ని వైద్య పరిభాషలో వెర్నల్‌ కెరటో కంజంక్టవైటిస్‌ (వీకేసీ) అంటారు. 

ఈ సమస్య నివారణ కోసం వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండటం ద్వారా కంటిని రక్షించుకోవాలి. ఇందుకోసం ప్లెయిన్‌ ప్రొటెక్టివ్‌  గ్లాసెస్‌ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు వీలైనన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. కంటి డాక్టర్‌ను కలిసి... వారు సూచించిన యాంటీ అలర్జిక్‌ చుక్కల వుందుల్ని వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఒకింత ఎక్కువ కాలం పాటు వీటిని వాడాల్సిరావచ్చు. వీటిల్లోనూ స్టెరాయిడల్, నాన్‌ స్టెరాయిడల్‌ (స్టెరాయిడ్‌ లేనివి) అనే రెండు రకాల మందులు ఉంటాయి. స్టెరాయిడ్‌ మోతాదులు ఉన్న మందుల్ని మాత్రం డాక్టర్‌ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మాత్రమే వాడాలి.

ఎక్కువకాలం వాడితే సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్‌ సూచించిన కాలానికి మించి వాటిని  వాడకూడదు. ఇక నాన్‌స్టెరాయిడ్‌ (స్టెరాయిడ్‌ లేని) మందుల్ని మాత్రం చాలా కాలంపాటు వాడవచ్చు.  ఉదాహరణకు ఓలోపాటడిన్‌ వంటి నాన్‌స్టెరాయిడ్‌ డ్రాప్స్‌ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్‌ డ్రాప్స్‌ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్‌ పలచలబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందుల్ని వాడుతున్న కొద్దీ నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ సూచనల మేరకు యాంటీహిస్టమైన్‌ ఐ డ్రాప్స్‌తో పాటు కొందరిలో యాంటీహిస్టమైన్‌ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది.  ఈ సవుస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా... నిర్లక్ష్యం మాత్రం మంచిది కాదు.  

మరిన్ని వార్తలు