శరీరంపై మచ్చలు పోవాలంటే ఇలా చేయండి...

9 Jan, 2022 20:03 IST|Sakshi

శరీరంపై మచ్చలు ఏర్పడటం చాలా సాధారణమైన సమస్యే అయినా... చూడ్డానికి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.  వీటినే శోభిమచ్చలు అంటుంటారు. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కూడా కనిపిస్తుంటాయి. చాలామందిలో ఇవి ఎందుకు వస్తాయో ఇదమిత్థంగా తెలియకపోయినా... కొందరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌గా ఇది కనిపిస్తుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘టీనియా వెర్సికలర్‌’ అంటారు. ఇది పెద్ద వయసు వారిలోను, మధ్య వయస్సు వారిలోను ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్త్రీ, పురుష భేధం లేకుండా వచ్చి ఇబ్బందిపెట్టే ఈ సమస్య ఎందుకొస్తుంది, అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం. 

ఈ సమస్య ఉన్నవారిలో చర్మం సహజరంగును కోల్పోతుంది. ముదురు ఎరుపువర్ణంలో, లేత గోధుమవర్ణంలో, తెలుపు వర్ణంలో ఈ మచ్చలు వస్తుంటాయి. వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి.  చిన్నపిల్లలలో ఇలాంటి శోభి లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసందర్భాల్లో ఈ మచ్చలకు చుట్టూ ఓ అంచులాంటిది ఏర్పడుతుంది. ఈ మచ్చలున్న చోట ఒక్కోసారి విపరీతమైన దురద ఉండవచ్చు. అయితే శోభిమచ్చలు అంటువ్యాధి కాదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీరూ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. 
చదవండి: Health Tips: ప్రతి రోజూ గంజి తాగారో..

కారణాలు 
స్పష్టమైన కారణాలు తెలియకపోయినా... చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్‌ అనే ఫంగస్‌ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ ఫంగస్‌ చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. దాదాపు మనందరి చర్మంలోనూ ఈ ఫంగస్‌ ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తుంది. 
చదవండి: Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..

ఎవరిలో ఎక్కువ...! 
►పౌష్టికాహార లోపం ఉన్నవారిలో
►వ్యాధినిరోధకతశక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో 
►స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవారిలో
►గర్భవతులలో
►హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... 
►బాగా ఎక్కువగా చెమటలు పట్టడం, అధికవేడి కారణంగా; (ఇలాంటివారిలో ఈ మచ్చలున్నచోట దురదలూ రావచ్చు). 
►జిడ్డు చర్మం ఉన్న వారిలో
►తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో
►కొందరిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. 
►తామరగా/ఇతర సమస్యలుగా పొరబడటం సాధారణం... 

కొందరు శోభిని చూసి తామర (రింగ్‌వార్మ్‌) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్‌ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు కెఓహెచ్‌ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనే విషయాన్ని నిర్ధారణ చేసి, తగిన చికిత్స సూచిస్తారు. 

నివారణ / జాగ్రత్తలు 
►ఇది తేలిగ్గా నివారతమయ్యే సమస్య. 
►చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి. 
►మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. 
►చర్మం బాగా జిడ్డుగా ఉన్నప్పుడు... ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే మరీ పొడిగానూ ఉంచకూడదు. 
►రీరం మీద నూనెగానీ, లేదా నూనెకు సంబంధించిన జిడ్డు పదార్థాలను కాని పూయకూడదు. 
►బాగా బిగుతుగానూ, గాలిచొరకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. 
►ఇది మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఎక్కువ చెమట పట్టకుండా చూసుకుంటూ,S కెటొకోనటోల్‌ ఉండే  పౌడర్‌ను కొన్ని నెలలు వాడటం మంచిది. 

చికిత్స  
ఈ సమస్య ఉన్నవారిందరకీ ఒకేలాంటి చికిత్స ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్మవ్యాధి నిపుణులు చికిత్స సూచిస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తి తాలూకు మెడికల్‌ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. ఫంగస్‌ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. లూలిఫిన్‌ వంటి యాంటీ ఫంగల్‌ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకెనజోల్‌ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ చాలా ఎక్కువగా ఉంటే, నోటితో తీసుకునే మందులను డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది. 

మరిన్ని వార్తలు