మంచి మాట.. నేను ఎవరు?

21 Feb, 2022 00:18 IST|Sakshi

ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు?
నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా?
ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..!

నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..!
అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..?
నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..!
ఎవరా నేను..?

నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను.
అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి.
ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది  అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం..

ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి.

 రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే  జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన.

సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా  తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి.

అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి.
ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు  మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.

జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా?
నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా.
చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన.

శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు.
జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.
కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.

అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును.  నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..?  ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే.
– భువనగిరి కిషన్‌ యోగి
 

మరిన్ని వార్తలు