Sanchi Stupa: అనగనగా.... ఓ బౌద్ధస్థూపం

15 May, 2021 19:25 IST|Sakshi
సాంచి స్థూపం ముందు మయన్మార్‌ బౌద్ధ సన్యాసులు

వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ 

రెండు వందల నోటు మీద గాంధీజీ ఉంటాడు. 
నోటును వెనక్కి తిప్పితే గాంధీ కళ్లద్దాలతోపాటు...
ఓ పురాతన కట్టడం కూడా కనిపిస్తుంది. 
అదే... అశోకుడు కట్టించిన గొప్ప బౌద్ధ స్థూపం.
రెండు వేల మూడువందల ఏళ్ల నాటి సాంచి స్థూపం. 

సాంచి బౌద్ధ స్థూపం పర్యటనకు వెళ్లే ముందు సాంచి స్థూపం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకోవాలి. సాంచి స్థూపాన్ని నిర్మించిన అశోకుడి భార్య పేరు విదిశ. ఆమె పేరు మీద సాంచికి పది కిలోమీటర్ల దూరాన ఒక పట్టణం కూడా ఉంది. అశోకుడితోపాటు విదిశ కూడా బౌద్ధాన్ని విస్తరింపచేయడంలో కీలక పాత్ర వహించింది. బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంక వెళ్లిన సంఘమిత్ర, మహేంద్రలు అశోకుడు– విదిశల పిల్లలే.  

అశోక స్తంభం
బౌద్ధ ఆరామాలు సాధారణంగా నీటి వనరులకు దగ్గరగా ఒక మోస్తరు ఎత్తున్న కొండల మీదనే ఉంటాయి. అలాగే... నివాస ప్రదేశాలకు సుమారు కిలోమీటరు దూరానికి మించకుండా ఉంటాయి. సన్యాసులు ప్రశాంతంగా వారి జీవనశైలిని కొనసాగించడానికి, గ్రామంలోకి వచ్చి భిక్ష స్వీకరించడానికి అనువుగా ఉండేటట్లు నిర్మించుకునే వాళ్లు. సాంచి స్థూప నిర్మాణంలోనూ అదే శైలిని అనుసరించారు. స్థూపంలో చక్కని శిల్పసౌందర్యం ఉంది. బుద్ధుని జీవితంలోని ఘట్టాలను శిల్పాల రూపంలో చెక్కారు. ఈ స్తూపం వ్యాసం 120 అడుగులు, ఎత్తు 54 అడుగులు. స్థూపానికి నాలుగు వైపుల ఉన్న తోరణ ద్వారాల్లో దక్షిణ ద్వారానికి దగ్గరగా అశోకుని స్తంభం ఉంది. ఇది సాంచి అశోకుని స్తంభం అంటారు. నాలుగు సింహాలు నాలుగు దిక్కులను చూస్తున్న స్థూపం ఇది. మన జాతీయ చిహ్నంగా సింహాలను ఈ స్థూపం నుంచి తీసుకున్నారు. స్థూపం ఆవరణలో ఉన్న మ్యూజియంలో నమూనా స్థూపాన్ని చూడవచ్చు.

మహాభిక్షపాత్ర
సాంచి స్థూపం ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నిర్వహణలో ఉంది. ఇక్కడ బౌద్ధ సాహిత్యం, సాంచి స్థూపం నమూనాలను కొనుక్కోవచ్చు. ఇక్కడి మ్యూజియంలో పెద్ద భిక్ష పాత్ర ఉంటుంది. అది రాతితో చెక్కిన పాత్ర. సాంచి పర్యటనకు వచ్చే వాళ్లు ఎక్కువగా భోపాల్‌లోనే బస చేస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీలంక మహాబోధి సొసైటీ ఆరామంతోపాటు అనేక దేశాల బౌద్ధ సన్యాసులు నిర్మించుకున్న ఆరామాలు కూడా ఉన్నాయి. 

సాంచి స్థూపం గురించి...
సాంచి పట్టణం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరానికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. పురాతన కట్టడాల అన్వేషణలో భాగంగా మనదేశంలో పర్యటించిన బ్రిటిష్‌ అధికారి జనరల్‌ టేలర్‌ 1818లో సాంచి బౌద్ధస్థూపం ప్రాముఖ్యతను గుర్తించాడు. తర్వాత 1881 నుంచి పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నెమ్మదిగా సాగిన మరమ్మత్తు పనులు 1912 – 1919 మధ్య కాలంలో సర్‌ జాన్‌ మార్షల్‌ ఆధ్వర్యంలో త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ స్థూపం 1989లో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు పొందింది.

బౌద్ధ బంధం
మయన్మార్‌ బౌద్ధ సన్యాసులను ఐదేళ్ల కిందట మనదేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు తీసుకు వెళ్లాను. ఆ సన్యాసులందరూ నాగార్జున యూనివర్సిటీలో మహాయాన బుద్ధిస్ట్‌ స్టడీస్‌లో చదువుకోవడానికి మనదేశానికి వచ్చినవాళ్లు. కొందరు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కొందరు రీసెర్చ్‌ కోసం వచ్చారు. బౌద్ధాన్ని ఆచరించే కుటుంబాలు తమ పిల్లల్లో ఒకరిద్దరిని ధర్మ పరిరక్షణ కోసం అంకితం చేస్తాయి. అలా వాళ్లు చిన్నప్పుడే బౌద్ధ సన్యాసులుగా మారిపోతారు. అశోకుడు– విదిశ తమ పిల్లలను బౌద్ధానికి అంకితం చేశారు.
– డాక్టర్‌ బి. రవిచంద్రారెడ్డి, బౌద్ధ ఉపాసకులు
 

Meenmutty Waterfalls: మీన్‌ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు