Hemakshi Meghani: మా పూర్వ విద్యార్థులు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది!

23 Feb, 2022 14:50 IST|Sakshi

ప్రజస్వామ్య బడి

దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న దేశం మనది. 35 ఏళ్ల లోపు వాళ్లు 65 శాతం ఉన్న దేశం ఎంత శక్తిమంతంగా ఉండాలి? ఎంత చైతన్యవంతంగా ఉండాలి? నిజానికి... ఉండాల్సినంత చైతన్యవంతంగా ఉందా మనదేశం? పార్లమెంట్‌లో చట్టాలు చేసే సభ్యుల సరాసరి వయసు యాభై ఏళ్లు. వారందరిలో 35 ఏళ్ల లోపు వాళ్లు కేవలం ఆరుశాతమేనా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయామె మెదడులో.

ఏ ప్రశ్నకూ ఆశాజనకమైన సమాధానం దొరకలేదు. ప్రశ్నకీ జవాబుకీ మధ్య విశాల విశ్వమంతటి అంతరం ఉందని కూడా అనిపించింది. ఇక మహిళల ప్రాతినిధ్యం విషయానికి వస్తే మనదేశం సాధించిన అత్యున్నత మహిళా ప్రాతినిధ్యం పద్నాలుగు శాతం. ఇది కూడా సిగ్గుపడాల్సిన సమాధానమే.

యువత రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపించకపోతే... దేశంలో చట్టాల రూపకల్పన చైతన్యవంతంగా ఎలా ఉంటుంది? వాటి ఆచరణ సమర్థంగా ఎలా సాగుతుంది? ఇలాగ ఎన్నో అనుబంధ ప్రశ్నలు. అసలు... సామాన్యులు రాజకీయరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోకపోవడం ఏమిటి? వీటన్నింటికీ సమాధానంగా హేమాక్షి మేఘాని ఆధ్వర్యంలో వెలిసింది ఐఎస్‌డీ. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ. 

మంచి కోసం మంచిదారి
హేమాక్షి 2011లో హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌లో మాస్టర్స్‌ చేస్తున్న సమయంలో రూపుదిద్దుకున్న ఆలోచన ఇది. మహిళలు రాజకీయరంగంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె నమ్మిన సందర్భం అది. హార్వర్డ్‌లో చదువు పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్‌లో బిల్డింగ్‌ రీసోర్సెస్‌ అక్రాస్‌ కమ్యూనిటీస్, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌లతో పనిచేసింది హేమాక్షి. ఆ తర్వాత 2018లో ప్రఖార్‌ భర్తియా సహకారంతో న్యూఢిల్లీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీని ప్రారంభించింది.

అతడికి యూత్‌ అలయెన్స్‌ స్టార్టప్‌కు సీఈవోగా పని చేసిన అనుభవం ఉంది. ఈ స్కూల్‌ ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని వివరిస్తూ ‘పార్లమెంట్‌ సభ్యుల్లో 43 శాతం మందికి క్రిమినల్‌ రికార్డు ఉంది. ఈ పరిస్థితిని తొలగించాలి. యువత దృష్టి జెండర్, లీడర్‌షిప్, పాలిటిక్స్‌... ఈ మూడు అంశాల మీద కేందీకృతం కావాలి. క్షేత్రస్థాయి నుంచి సూత్రబద్ధమైన రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకునేటట్లు వాళ్లను ప్రోత్సహించాలి.

మంచి వ్యక్తులు ఈ రంగంలోకి రావడానికి అవసరమైన ఓ మంచి దారి వేయడమే ప్రధాన ఉద్దేశం. మేము ఒక వెయ్యి మందిని తయారు చేసి సమాజంలోకి పంపిస్తే వారిలో కనీసం పాతికశాతం మంది అయినా ఎన్నికల్లో నెగ్గితే ప్రజాస్వామ్యానికి మా వంతు సేవలు అందినట్లే’ అంటోంది హేమాక్షి. 

ఇదేం చోద్యం!
ఐఎస్‌డీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు, ఆఫ్‌లైన్‌ క్లాసుల ద్వారా పాఠాలు బోధిస్తోంది. పురుషాధిక్య సమాజంలో రాజకీయరంగం అంటే తమదే అనే భావన నరనరాన జీర్ణించుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఇలాంటి ప్రయత్నం చేయడం కూడా వారికి ఆశ్చర్యంగానే ఉంటోంది. శిక్షణ కోసం ఐఎస్‌డీకి వచ్చిన వాళ్లు కూడా ఆర్థిక వ్యవహారాలు చూసుకునే మా సహ వ్యవస్థాపకుడు ప్రఖార్‌తో మాట్లాడడానికే ప్రయత్నిస్తారు తప్ప ఈ స్కూల్‌ నిర్వహిస్తున్న నాతో మాట్లాడాలంటే సందేహంగా, ఇదేం చోద్యం అన్నట్లు చూస్తారు అని నవ్వుతూ చెబుతుంది హేమాక్షి.

మార్పు సాధ్యమే!
‘‘ఇప్పటి వరకు మా స్కూల్‌ నుంచి రెండు వందల మంది శిక్షణ తీసుకున్నారు. వారిలో 26 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారు. వాళ్లలో కొంతమంది ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కూడా. ఇటీవల ఒడిషాలో పర్యటించాను. అక్కడి జిల్లా పరిషద్‌ ఎన్నికల బరిలో మా స్కూలు పూర్వ విద్యార్థి పోటీ చేశాడు. అక్కడ నేను చూసిందేమిటంటే... ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటు అడగడానికి ఒక గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఓటు వేయడానికి ఏమిస్తారని అడిగారు.

బదులుగా మా విద్యార్థి చాలా సంయమనంతో ‘నేను డబ్బిచ్చి ఓట్లు వేయించుకుంటే రేపు మీకు పని ఎవరు చేస్తారు’ అని తిరిగి ప్రశ్నించాడు. గ్రామస్థులు వెంటనే ఏమీ అనలేదు, కానీ ఆలోచనలో పడ్డారని మాత్రం చెప్పగలను. మరొక పూర్వ విద్యార్థి ప్రియాంక విషయానికి వస్తే... ఆమె బిహార్, సీతామర్హిలో ఒక గ్రామానికి ముఖియా ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రచారంలో ఇంటింటికీ వెళ్లింది.

ఆ సమయానికి ఒక ఇంటి వాళ్లు భోజనం చేస్తుంటే, వాళ్లు లోపలికి ఆహ్వానించే వరకు ఇంటి బయటే ఎదురు చూసింది. డాలీ గత ఏడాది బీహార్‌లో పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. అర్చన రాబోయే గ్రేటర్‌ బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయనుంది.

ఈ ఏడాది ఎనిమిది మంది మా పూర్వ విద్యార్థులు పంచాయితీ, కౌన్సిల్‌ స్థాయుల్లో పోటీ చేయనున్నారు. మా విద్యార్థులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విధానాన్ని గమనించినప్పుడు నా ప్రయత్నం విజయవంతం అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని హేమాక్షి ఇనుమడించిన ఉత్సాహంతో చెప్పింది.

చదవండి: తేడా వస్తే.. ఆ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్‌ వెళ్లిపోద్ది

మరిన్ని వార్తలు