మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు

2 Dec, 2020 07:59 IST|Sakshi

జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియాను తిట్టుకోండి..
నిద్ర పట్టడం కష్టంగా ఉందా? రాత్రంతా పడకపై అటు ఇటు దొర్లేస్తున్నారా? ఒళ్లు తెలియకుండా నిద్రపోయి ఎంత కాలమైందో అనిపిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం అవును అయితే మీ జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియాను తిట్టుకోండి. ఎందుకంటారా? మన కడుపు, పేగుల్లోని బ్యాక్టీరియాలో వైవిధ్యత తగ్గిపోతే నిద్ర కూడా తగ్గుతుందని చెబుతున్నారు జపాన్‌లోని త్సుకుబా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గుండె జబ్బులు మొదలుకొని కేన్సర్‌ వరకు అనేక ప్రాణాంతక వ్యాధులకు బ్యాక్టీరియా వైవిధ్యతలో తేడాలే కారణమని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ శాస్త్రవేత్తలు నిద్రలేమికి బ్యాక్టీరియాకు మధ్య ఉన్న సంబంధాన్ని వెతికే ప్రయత్నం చేశారు. కొన్ని ఎలుకలకు నాలుగు వారాల పాటు బలమైన యాంటీబయాటిక్‌ మందులు ఇచ్చారు.

సాధారణంగా పెంచిన ఎలుకలతో పోలిస్తే మందులు వాడిన వాటి పేగుల్లో ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే ద్రవాలు (మెటబోలైట్స్‌) తక్కువగా ఉన్నట్లు తెలిసింది. సుమారు 60 రసాయనాలు అసలు కనిపించకుండా ఉంటే.. మిగిలిన వాటి మోతాదుల్లో తేడాలున్నట్లు తెలిసింది. ఈ మెటబోలైట్స్‌ కడుపులో న్యూరో ట్రాన్స్‌మీటర్లు ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని, ట్రిప్టోఫాన్‌ నుంచి సెరటోనిన్‌ను ఉత్పత్తి చేసే మెటబోలైట్స్‌ కూడా వీటిల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీబయాటిక్‌ మందులు వాడిన ఎలుకల్లో విటమిన్‌ బీ–6 మెటబోలైట్స్‌ కూడా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ మెటబోలైట్స్‌ నిద్రకు దోహదపడే డోపమైన్, సెరటోనిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. బ్యాక్టీరియా వైవిధ్యత తగ్గిన ఎలుకల ఈఈజీని పరిశీలించినప్పుడు నిద్రలో చాలా తేడాలున్నట్లు స్పష్టమైంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్యాక్టీరియా వైవిధ్యతను పెంచుకోవడం ఎలా? అనుకుంటున్నారా? చాలా సింపుల్‌. వీలైనంత సహజ ఆహారం తీసుకోవడమే. పాలు, పెరుగు వంటివి కూడా బాగా ఉపయోగపడతాయి.

సొల్యూషన్‌ లేని పొల్యూషన్‌..
కరోనా కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోతే.. వాతావరణం కాస్త మెరుగైందని కొన్ని నెలల కింద వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాలుష్య కారక వాయువుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అంటోంది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో). 2020 మొత్తమ్మీద ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయిన కారణంగా గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాల్లో 4.2 నుంచి 7.5 శాతం తగ్గుదల మాత్రమే నమోదైందని డబ్ల్యూఎంవో తెలిపింది. అయితే వాతావరణంలో గత పదేళ్ల కంటే ఈ ఏడాది ఎక్కువ వేగంగా ఈ కాలుష్యకారక వాయువులు పేరుకుపోయాయని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది. ‘దీర్ఘకాలిక ఉద్గారాలతో పోలిస్తే లాక్‌డౌన్‌ కారణంగా తగ్గిన ఉద్గారాలు చాలా తక్కువ. సుస్థిరమైన పద్ధతిలో ఉద్గారాల పెరుగుదల గ్రాఫ్‌ను వంచాల్సి ఉంటుంది’అని డబ్ల్యూఎంవో జనరల్‌ సెక్రటరీ పెట్టేరి తాలాస్‌ తెలిపారు.

హవాయిలోని మౌనాలోవా ప్రాంతంలో వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదు ప్రతి పది లక్షల అణువులకు (పీపీఎం) 411.3గా ఈ ఏడాది నమోదైందని, గతేడాది ఈ సంఖ్య 408.5 అని వివరించారు. వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదు 2015లోనే 400 పీపీఎంను దాటిపోతే నాలుగేళ్లలోనే ఇంకో 10 పీపీఎం వరకూ పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని తాలాస్‌ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా కాలుష్యం పెరుగుతోందని, 2030 నాటికి ఉద్గారాలను సగానికి తగ్గించాలన్న లక్ష్యం నెరవేరాలంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది. లేదంటే భూతాపోన్నతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరగడమే కాకుండా.. కరువు కారణంగా మరణాలు ఎక్కువ అవుతాయని హెచ్చరించింది.

అక్షరాలా లక్షా 20 వేల కోట్ల ట్రాన్సిస్టర్లు!
మీ కంప్యూటర్‌లో ఉన్న మైక్రోప్రాసెసర్‌లో ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉంటాయో మీకు తెలుసా? అత్యాధునికమైన ఇంటెల్‌ ఐ9 ప్రాసెసర్‌ను చూస్తే అందులో కొంచెం అటు ఇటుగా 700 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఈ మైక్రోప్రాసెసర్‌ సైజు దాదాపుగా నాలుగు అంగుళాల పొడవు, 4.5 అంగుళాల వెడల్పు, 1.57 అంగుళాల మందం ఉంటుంది. కానీ.. దీనికి రెట్టింపు సైజులో ఉన్న మైక్రోప్రాసెసర్‌లో తాము ఏకంగా లక్ష ఇరవై వేల కోట్ల ట్రాన్సిస్టర్లు ఏర్పాటు చేశామని, ఈ ప్రాసెసర్‌తో నడిచే కంప్యూటర్‌ సూపర్‌ కంప్యూటర్ల కంటే శక్తిమంతమైందని సెరబ్రాస్‌ సిస్టమ్స్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్‌ కంప్యూటర్లపై గత వారం జరిగిన ఒక సదస్సులో సెరబ్రాస్‌ ఈ మెగా కంప్యూటర్‌ చిప్‌ వివరాలను వెల్లడించింది.

సెరబ్రాస్‌ సీఎస్‌–1 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రాసెసర్‌ ఇంటెల్‌ జియాన్‌ ప్రాసెసర్లతో తయారైన జౌల్‌ సూపర్‌ కంప్యూటర్‌ కంటే 200 రెట్లు ఎక్కువ వేగంగా లెక్కలు చేయగలదు. జౌల్‌ సూపర్‌ కంప్యూటర్‌లో ఒక్కో జియాన్‌ మైక్రోప్రాసెసర్‌లో 20 కోర్లు.. మొత్తమ్మీద 16,000 కోర్లు ఉన్న బహుళ మైక్రోప్రాసెసర్లు ఉంటాయి. సెరబ్రాస్‌ సీఎస్‌–1లో 84 వర్చువల్‌ మైక్రోప్రాసెసర్లు, 4,539 కోర్లతో కూడిన సిలికాన్‌ మైక్రోప్రాసెసర్లు మాత్రమే ఉంటాయి. మొత్తం 18 గిగాబైట్ల ర్యామ్‌తో కూడిన సెరబ్రాస్‌ సీఎస్‌–1తో కంప్యూటింగ్‌ శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుందని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌ అని చెప్పుకోవాలని కంపెనీ సీఈవో ఆండ్రూ ఫెల్డ్‌మాన్‌ తెలిపారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా