చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు? 

5 Mar, 2023 00:36 IST|Sakshi

గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి.

ఫిఫా (ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. 

అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? 
అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్‌లైయింగ్‌ ఫ్యాక్టర్స్‌ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. 
కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం.
♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం.
♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్‌ నోడ్‌ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్‌నార్మాలిటీస్‌) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. 

కోవిడ్‌ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...?  
కోవిడ్‌ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్‌ఫ్లమేషన్‌ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్‌’, హార్ట్‌ఫెయిల్యూర్‌లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 

ఇదొక్కటే  కాదు... కోవిడ్‌  తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి  రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్‌) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్‌ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్‌ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. 

♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్‌ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. 
♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే.  
♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్‌తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్‌ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్‌మార్టమ్‌ అవసరం. 

యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...?
♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. 

నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? 
ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది.

చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్‌లో  చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్‌ అప్, కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. 

♦  ప్రాణాలను కాపాడే సీపీఆర్‌ (కార్డియో పల్మునరీ రిససియేషన్‌)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్‌పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. 
 ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో  డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి.


గుండెపోటు  ముప్పును తెచ్చిపెట్టే  అంశాలేమిటంటే? 
మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు,  కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు.  
♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు  ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్‌టెన్షన్‌), మధుమేహం (డయాబెటిస్‌) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. 
♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది.  
♦  ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి.

- డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ,  సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌

మరిన్ని వార్తలు