ఆటోకి మూడు చక్రాలే ఎందుకు? నాలుగు చక్రాలతో ఎందుకు తయారు చేయలేదో తెలిస్తే...

1 Jun, 2023 07:09 IST|Sakshi

నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరం

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్‌ వర్క్‌ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్‌ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది.

సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్‌ ప్రదేశాలలో ఆటో డ్రైవ్‌ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు