రైతుల ఆందోళన; పసుపుపచ్చటి నిరసన

19 Dec, 2020 09:02 IST|Sakshi

చనిపోయినవారు బతికున్నవారితో కలిసి ఒకేచోట చేరడం ఢిల్లీలో జరిగింది. పంజాబ్‌లోని దాదాపు 2000 మంది వితంతువులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పసుపుపచ్చటి దుపట్టాలు తలపై కప్పుకుని పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫొటోలే. భర్తలవి. తండ్రులవి. కుమారులవి. అన్నీ బాగుంటేనే ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.. ఈ కొత్త చట్టాల వల్ల ఇంకా ఎంతమంది వితంతువులను తయారు చేస్తారు మీరు? అని వారు ప్రశ్నించారు. వితంతువులందరూ ఒక్కటై తమ నిరసనను వ్యక్తం చేయడం ఈ ఉద్యమంలో ఒక బలమైన సందర్భం. వీరు చెబుతున్న కథలు వ్యధాభరితం.

శోకం చాలా గాఢంగా ఉంటుంది. అది చాలా సహనాన్ని కూడా ఇస్తుంది. కాని ఒక దశ తర్వాత అది తిరగబడుతుంది. శోకానికి కూడా చివరి బిందువు ఉంటుంది. అది దాటితే కన్నీరు కార్చే కళ్లు రుధిర జ్వాలలను వెదజల్లుతాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఇదే కనిపిస్తోంది. చదవండి: నాకు పేరొస్తుందనే.. విపక్షాలపై మోదీ ధ్వజం

ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలో బుధవారం ప్రత్యేకంగా ‘వితంతువుల నిరసన’ నిర్వహించేందుకు సోమ, మంగళవారాల్లోనే పంజాబ్‌ నుంచి వితంతువులు ప్రత్యేక బస్సుల్లో, ట్రాలీలలో బట్టలు, ఆహారం పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరేముందు స్థానిక కలెక్టర్‌ ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన కొత్త సవరణలతో వచ్చిన చట్టాలు వీరికి ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. చదవండి: రైతుల వాదనకే మద్దతు

ఢిల్లీ– హర్యానా సరిహద్దులోని టిక్రీ వద్ద వేలాదిగా రైతులు బైఠాయించి నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, సవరింపులను ఒప్పుకోము అని వారు తేల్చి చెబుతున్నారు. మగవారు వ్యవసాయాన్ని వదిలి ఇక్కడకు చేరగా పంజాబ్‌లో చాలా మటుకు స్త్రీలు, పిల్లలు పొలం పనులు చూస్తున్నారు. అయితే బుధవారం రోజున ప్రత్యేకంగా వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, తల్లులు, తోబుట్టువులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
 
భారతదేశంలో 2019లో 10,281 మంది వ్యవసాయరంగంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 5,957 మంది రైతులు కాగా, 4,324 మంది రైతు కూలీలు. దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయరంగ ఆత్మహత్యలు 7.5 శాతం ఉన్నాయి. పురుషుడు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటూ ఉంటే స్త్రీ కుటుంబం కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటూ రావడం దేశమంతా ఉంది. ‘ఏ రోజైతే మా ఇంటి మగాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజే మా జీవితం ఆగిపోయింది’ అని ఇక్కడ నిరసనలో పాల్గొన్న వితంతువులు తెలియచేశారు. ‘పంజాబ్‌లో సంపన్న రైతులు ఉన్నారు. అలాగే పేద రైతులు తక్కువేం లేరు’ అని ఈ మహిళలు అన్నారు.

వీరు ఇలా వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏమంటే ఆ అప్పులు పెరుగుతూ ఉండటం. దేశంలో ఏ చట్టమైనా ఇంటిని, ఇంటి స్త్రీని రక్షించేదిగా ఉండాలని ప్రజలు అనుకోవడం సహజం. ఇప్పడు ఆ స్త్రీ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ ఆందోళన తొలగక పోతే అశాంతి కొనసాగుతూనే ఉంటుంది.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు