చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్‌ ఆలోచనలు వేరు.. !

29 Oct, 2021 12:02 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసిలోని నేచరల్‌ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్‌. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్‌ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్‌ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను  ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్‌ విభాగంలో బెస్ట్‌ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్‌ అందుకుంది.

ఎంత సంతోషం!
భోపాల్‌(మధ్యప్రదేశ్‌)కు చెందిన సుయాస్‌ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్‌లైఫ్‌పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్‌ అండ్‌ జెర్రీలాంటి కార్టూన్‌ సీరియల్స్‌ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్‌ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్‌కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్‌లోని జూపార్క్‌లను చూసేవాడు.

చదవండి: Health Tips: ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..

తన బాల్యంలో ఒకసారి...
ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్‌. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్‌ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్‌ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ...

అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్‌ ఉన్నట్లు అనిపించింది. జంగిల్‌ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్‌ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్‌! అందులో యూత్‌ ఎక్కువ.

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్‌ను తీసుకొని ఫిల్మ్‌సిరీస్‌ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్‌. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్‌ కల. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్‌ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్‌ఫామ్‌ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్‌. 

చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

మరిన్ని వార్తలు