భర్త సిగరెట్‌ అలవాటు ప్రభావం భార్య గర్భధారణపై ఉంటుందా..?

19 Sep, 2021 08:53 IST|Sakshi

Husband Smoking Habit Affect Wife Pregnancy: భర్త సిగరెట్‌ తాగితే ప్యాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావాల కారణంగా దాని దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిన విషయమే.  అయితే అతడు ఇంటి బయట సిగరెట్‌ తాగి వచ్చినా ఆ అలవాటు దంపతులిద్దరితో పాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుంది. అతడి సిగరెట్‌ అలవాటు వల్ల సంతాన సాఫల్య అవకాశాలూ తగ్గుతాయి. అతడు తాగే సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ దుష్ప్రభావాలూ పెరుగుతాయి. భర్తకి స్మోకింగ్‌ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్‌నర్‌కు గర్భధారణ కూడా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా  అతడి స్మోకింగ్‌ కారణంగా భార్యలోని హార్మోన్‌ సైకిళ్లలో పాలు పంచుకునే జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. దాంతో ఆమెలోని అండాల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు.

మహిళకు సంతాన సాఫల్య చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి... ఆమె  భర్తకు సిగరెట్‌ అలవాటు ఉన్నప్పుడు... ఐవీఎఫ్‌ లాంటి ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యూలేషన్‌కు మరిన్ని మందులు అవసరమవుతాయి. అందుకే సాధారణ దంపతులతో పోలిస్తే భర్తకు ఈ దురలవాటు ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలూ పెరుగుతాయి. గర్భధారణ జరిగాక కూడా నెలలు నిండకముందే బిడ్డపుట్టే (ప్రీమెచ్యుర్‌ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే చిన్నారుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. 

ఇక పొగతాగే పురుషుల విషయానికే నేరుగా వస్తే... తమ అలవాటు కారణంగా వాళ్ల  వీర్యంలో శుక్రకణాల సంఖ్య, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా  సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటును వదులుకోవడమే మేలు. అంతేకాదు... కేవలం సంతానం విషయంలోనే కాకుండా వారి ఆరోగ్యంతో పాటు, భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది.
చదవండి: Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి!
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు