సీజనల్ వ్యాధులు.. కిచెన్‌ ఫార్మసీతో చెక్ పెట్టండి

22 Jan, 2022 11:12 IST|Sakshi

ఈ సీజన్‌ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్‌ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్‌ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్‌ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి.
►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. 
►పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి.
►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్‌ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. 
►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్‌ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.   
►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి.  
►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్‌...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్‌ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి.

మరిన్ని వార్తలు