Winter Tips: వేళ్ల నొప్పులు బాధిస్తుంటే.. మనకు మనమే ఇలా చేసుకుంటే..

18 Dec, 2021 10:20 IST|Sakshi

వేళ్ల నొప్పులకు ఫిజికల్‌ థెరపీ

Health Tips: చలికాలంలో ఎదురయ్యే సమస్యల్లో కీళ్లు పట్టేయడం ఒకటి. అయితే తుంటికీళ్లు, మోకాళ్లు పట్టేసినప్పుడు మాత్రమే కీళ్ల సమస్యగా పరిగణిస్తుంటాం. అంతకంటే ముందే చేతివేళ్లు బిగుసుకుపోయి వేళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా కాలానుగుణంగా జరిగే ప్రక్రియ.

ఈ సీజన్‌లో అరచేతి నుంచి వేళ్ల వరకు ఉండే కనెక్టింగ్‌ టిష్యూలు మందబారడం, సంకోచించడం వల్ల కదలికలు నెమ్మదిస్తాయి. బలవంతంగా కదిలించే ప్రయత్నం చేసినప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ నొప్పులకు స్వయంగా మనకు మనంగా చేసుకునే ఫిజికల్‌ థెరపీనే చక్కటి వైద్యం.

అరచేతిని టేబుల్‌ మీద కానీ చదునుగా ఉన్న నేల మీద కానీ పెట్టి మెల్లగా వేళ్లను చాచాలి.
కీళ్ల మీద మరీ ఒత్తిడి కలిగించకుండా అరచేతిని వీలయినంత వెడల్పుగా చేసి  వేళ్లను ఒక వేలికి మరొక వేలిని దూరంగా వచ్చేటట్లు చేయాలి.
ఈ స్థితిలో అరచేయి మొత్తాన్ని నేలకు ఆన్చడానికి ప్రయత్నించగలగాలి.
నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యం కాదు, కానీ చేయగలిగినంత వరకు ప్రాక్టీస్‌ చేయాలి. అరచేతిని నేలకు ఆన్చిన స్థితిలో 30 నుంచి 60 సెకన్ల పాటు అలా ఉంచిన

తర్వాత చేతిని మెల్లగా పిడికిలి బిగించి వదలాలి. రోజూ నాలుగైదు సార్లు ఇలా చేస్తుంటే వేళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
పై ఎక్సర్‌సైజ్‌ చేయడానికి సాధ్యం కానప్పుడు గంటకోసారి పిడికిలిని గట్టిగా బిగించి ఒక్కో వేలిని తెరుస్తూ అన్ని వేళ్లనూ తెరవాలి.
అలాగే ఒక్కో వేలిని ముడుస్తూ పిడికిలి బిగించి వదలాలి.
మామూలు సీజనల్‌ నొప్పులతోపాటు డయాబెటిక్‌ న్యూరోపతి కండిషన్‌కు కూడా ఈ ఎక్సర్‌సైజ్‌ ఉపకరిస్తుంది.
ఒకవేళ వేళ్ల నొప్పులకు కారణం ట్యూమర్‌లు, ప్రమాదవశాత్తూ గాయపడడం, ఆర్థరైటిస్‌ వంటి పరిస్థితుల్లో మాత్రం డాక్టర్‌ పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. 

చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

మరిన్ని వార్తలు