Health Tips: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..

6 Dec, 2021 14:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Winter Season: Tips To Handle Asthma Allergy Doctors Suggestions: ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరని అనుకుంటారు కొందరు. కానీ ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ. సౌకర్యం కోసం శ్వాస వ్యవస్థను అప్పర్‌ రెస్పిరేటరీ ఎయిర్‌ వే అనీ... కింది భాగాన్ని లోయర్‌ రెస్పిరేటరీ ఎయిర్‌ వే అని చెబుతుంటారు గానీ... ఈ రెండూ ఒకటే. డూప్లె(క్స్‌) భవనంలోని పై భాగం అప్పర్‌ ఎయిర్‌ వే అయితే... కింది భాగం లోయర్‌ ఎయిర్‌ వే... ఈ  రెండూ కలిసిన ఒకే ఇల్లు లాంటివివి.

అలర్జీ వల్ల పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్‌ రైనైటిస్‌’. అదే కింది భాగం అయితే అది ఆస్తమా. గమనించి చూస్తే 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, ఆస్తమా ఈ రెండూ ఉంటాయి. ఈ సీజన్‌లో వీటి బెడద మరింత ఎక్కువ. అందుకే చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. 

అలర్జీలు
అలర్జీ అంటే ఏదైనా మనకు సరిపడని పదార్థం మనలోకి  ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ!. అదెంత ఎక్కువగానంటే... మన ఆరోగ్యాన్నే దెబ్బతీసేంత తీవ్రంగా! అప్పుడు మన దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. అలా అలర్జీని కలిగించే పదార్థాల్ని  ‘అలర్జెన్‌’ అంటారు. 

అలర్జీలు వేటివేటితో... నిర్వహణ ఎలా? 
సాధారణంగా పిల్లల్లో / పెద్దల్లో చాలా మందికి చాలా రకాల అంశాలు సరిపడవు.
ఆహారాలు : చాక్లెట్స్, గోధుమలతో వండిన ఆహారాలు, కొందరికి గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, పాలతో చేసిన పదార్థాల వంటి వాటితో రావచ్చు.
పాలు తాగే పసిపాపల్లో  సైతం బాటిల్‌ ఫుడ్, పోతపాలు, టిన్డ్‌ ఫుడ్‌ వంటివాటితో అలర్జీలు రావచ్చు. 
నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : పిల్లలకు సరిపడని వాటిని... వారినుంచి దూరంగా ఉంచడమే దీనికి తొలి చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. 

పరిసరాలు/ వాతావరణం : పొగ, దుమ్ము ధూళి, పుప్పొడి, దోమల మందు వంటివి. 
నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : పైన పేర్కొన్నవి కమ్ముకుని ఉండే చోట్ల నుంచి దూరంగా ఉండాలి.  

మందులు / ఇతరాలు :  కొందరు పిల్లలకు పెన్సిలిన్, యాస్పిరిన్‌ వంటివి సరిపడకపోవచ్చు. మరికొందరికి కాస్మటిక్స్‌ పడకపోవచ్చు.  సోయా అలర్జీ, మోల్డ్‌ అలర్జీ, సన్‌ అలర్జీ, కొందరికి రబ్బర్‌ వస్తులతో కలిగే లేటెక్స్‌ అలర్జీ... ఇలా ఎన్నెన్నో కారణాలతో... రకాల అలర్జీలు వచ్చే అవకాశముంది. 
నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : మనకు అలర్జీ కలిగించే అంశం ఏదైనా దాన్ని నుంచి దూరంగా ఉండటమే దాని నివారణకూ, నిర్వహణకు మేలైన మార్గమని గుర్తుంచుకోవాలి. 

ఆస్తమా
ఆస్తమాను ప్రేరేపించే అంశాలు... దాని నిర్వహణ
అలర్జిక్‌ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాలా రావచ్చు. అలాగే తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. 
నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : మనకు సరిపడని ఆహారానికి/వాతావరణానికి/పరిసరాలకు దూరంగా ఉండటం

వ్యాయామం : తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కొందరిలో ఆస్తమా రావచ్చు. మనం గాలిని పీల్చగానే ముక్కులోకి ప్రవేశించిన బయటి చలి గాలిని కాస్తంత వెచ్చబరచడం, తేమ ఉండేలా చేయడం వంటి పనులను ముక్కు చేస్తుంది. వ్యాయామ సమయంలో సాధారణ సమయంలో కంటే పెద్దమొత్తంలో గాలిని పీల్చుకుంటుంటాం.

దాంతో బయటి గాలి తాలూకు టెంపరేచర్, తేమల తేడాలను తట్టుకోలేని శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి.  వ్యాయామం కారణంగా ఎక్కువ మోతాదులో గాలి అవసరమవుతుంది. కానీ ముడుచుకుపోయిన శ్వాసనాళాల నుంచి అవసరమైన మేరకు గాలి అందదు. దాంతో 
‘ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా’ వస్తుంది. 

నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా మొదలవుతుంది. బయటి గాలిలో, ముక్కు నుంచి దేహంలోకి లోపలికి ప్రవేశించాక ఉన్నగాలిలో తేడాలు ఎక్కువైతే ఇది వస్తుంది కాబట్టి దేహం కూడా దీన్ని తట్టుకునేలా నేరుగా వ్యాయామం మొదలుపెట్టకుండా... కనీసం 5 – 10 నిమిషాల పాటు వార్మ్‌ అప్‌ వ్యాయామాలు చేయాలి. వార్మ్‌ అప్‌ వ్యాయామాలు ఎంతసేపు చేస్తే... ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా వచ్చే అవకాశాలు అంతగా తగ్గుతాయి. ఒకవేళ అప్పటికీ వస్తూనే ఉంటే వ్యాయామం తాత్కాలికంగా ఆపేసి, డాక్టర్‌ సలహా తీసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. 

జీఈఆర్‌డీ సమస్యతో అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో ఆహారం తీసుకున్న తర్వాత వారి కడుపులో జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్‌ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం కడుపులోంచి గొంతులోకి వెనక్కు వెళ్లినప్పుడు (రిఫ్లక్స్‌) గొంతు, పొట్టపైభాగంలో మంట, నొప్పి వస్తాయి.కొందరిలో తిన్నది గొంతులోకి  వస్తున్నట్లుగా అనిపిస్తు్తంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ) అంటారు.

పులితేన్పుల రూపంలో యాసిడ్‌ గొంతులోకి రాగానే గొంతు మండడం, కడుపు ఉబ్బరం చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. జీఈఆర్‌డీ సమస్య ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కడుపు బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, నిద్రలో సమస్య ఎక్కువై, మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. 
 

నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : సాధారణంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేవారిలో ఇలాంటి ఆస్తమా ఎక్కువ. అందుకే తక్కువ మోతాదుల్లో తింటూ కడుపును తేలిగ్గా ఉంచుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ వీలైనంత ముందుగా భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత) పడుకోకుండా / నిద్రకు ఉపక్రమించకుండా కాసేపు అటు ఇటు నడిచాకే పక్క మీదికి చేరాలి. 

ఇతర కారణాలతో... పొగాకు పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగుల (పెయింట్స్‌) లేదా అగరుబత్తీల వంటి వాటి వాసన సరిపడకపోవడం వంటి అంశాలతోనూ ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ ఆస్తమా’ అంటారు.  కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. 

నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) : తమకు సరిపడని వాటి నుంచి దూరంగా ఉండటమే ఈ సమస్యల నివారణకు మార్గం. అలాగే వర్క్‌ప్లేస్‌ ఆస్తమా ఉన్నవారు... వీలైతే తమ వృత్తిని మార్చుకోవడమే మేలు. ఇక మందులతో ఆస్తమా వచ్చేవారు... ఏవి తమకు సరిపడటం లేదో గుర్తించి, ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలిపి, మందులను మార్పించుకోవాలి. 
-డాక్టర్‌  రఘుకాంత్‌..సీనియర్‌ కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ 
చదవండి: Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్‌ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్‌ అస్సలు వదలరు!

మరిన్ని వార్తలు