చింతించడం ఆపి జీవించడం మొదలుపెట్టు

30 Oct, 2020 08:15 IST|Sakshi

‘నీ దగ్గర నిమ్మకాయలు ఉంటే నిమ్మరసమే పిండుకుని తాగు’ అంటాడు డేల్‌ కార్నెగీ. ‘చింతించడం ఆపి జీవించడం మొదలుపెట్టు’ అని 1945 లో ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం లోనివి ఈ నిమ్మకాయలు, నిమ్మరసం. ఆయన కన్నా ముందే హబ్బార్డ్‌ ఈ మాట రాశాడని కూడా అంటారు. ఇద్దరూ అమెరికన్‌ రచయితలే. ఇద్దరూ ఇప్పుడు లేరు. ముందూ వెనుకగా ఎవరు చెప్పినా జీవితంలో ముందుకు నడిపించే మాటే ఇది. శ్రీదేవికి జీవితంలో ముందుకు నడిచి తీరవలసిన అవసరం రెండుసార్లు ఏర్పడింది. తను హై స్కూల్‌లో ఉండగా తల్లిని, తనను, చెల్లిని వదిలేసి తండ్రి ఇల్లొదిలి వెళ్లి పోయినప్పుడు ఒకసారి. 18వ ఏట పెళ్లై, భర్త తాగుబోతు అన్న విషయం బయట పడినప్పుడు మరొకసారి. తనకు 36 ఏళ్ల వయసు వచ్చేలోపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంది శ్రీదేవి. ఇప్పుడు ఆమెకు 37 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఇద్దరు పిల్లలు. చెల్లి పెళ్లి తనే చేసింది. తల్లిని, తాగుబోతు భర్తనీ పద్దెనిమిదేళ్లుగా తనే చూస్తోంది.

అందుకోసం ఆమె చేయని పని లేదు. నేర్చుకోని విద్య లేదు. ట్రాక్టర్‌ నడుపుతుంది. కొబ్బరి చెట్లెక్కి కాయల్ని దింపుతుంది. ఈత చాపలు అల్లుతుంది. జీడి కాయలు వలిచే ఫ్యాక్టరీకి వెళుతుంది. బట్టల దుకాణంలో పని చేస్తుంది. చేపలు పడుతుంది. కోళ్లఫారంలో ఉంటుంది. ఆటో తోలుతుంది. కుక్కల్ని పట్టి బోనెక్కిస్తుంది. పాముల్ని పట్టి ఫారెస్టు అధికారులకు ఇస్తుంది. కుందేళ్లను, పందుల్ని పెంచుతుంది. మొత్తం 74 పనులు చేతనవును శ్రీదేవికి! అన్నీ కష్టపడి నేర్చుకున్న పనులే. శ్రీదేవిని అంతగా కష్ట పెట్టినందుకు జీవితం ఆమె ఎదుట చేతులు కట్టుకుని అపరాధిలా నిలుచోవాలి. అప్పుడు కూడా శ్రీదేవి ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను‘ అంటుంది తప్ప రాటు తేలిన చేతుల్ని చూసుకోదు. అంతలా తన చుట్టూ రక్షణగా పనులను పేర్చుకుంది. శ్రీదేవిది కేరళలోని కట్టకడ. డేల్‌ కార్నెగీ, హబ్బార్డ్ చెప్పినట్టుగా‌ ఉన్న దాంతోనే జీవితాన్ని లాగించాలని అన్నారు. ఏదీ లేని రోజులు కూడా శ్రీదేవి జీవితంలో చాలానే ఉన్నాయి. అందుకే పని లేని రోజు లేకుండా ఉండటం కోసం జాగ్రత్త పడినట్లుంది. సహస్ర వృత్తుల శ్రామిక స్వరూపిణి అయింది.

చదవండి: రోడ్డు మీద వరి పండించాడు 

>
మరిన్ని వార్తలు