వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్‌ అన్నీ!

26 Jul, 2022 00:36 IST|Sakshi

వ్యాపారానికి సామాజిక కోణం తోడైతే బాగుంటుంది. అలాంటి వ్యాపారానికి ఆవిష్కరణలు తోడైతే మరీ బాగుంటుంది. ‘లిఫాఫ’ బ్రాండ్‌తో తనదైన ట్రెండ్‌ను సృష్టించింది కనిక అహుజా. ఆమె వ్యాపార సారాంశం... ‘హీనంగా చూడకు దేన్నీ... పనికొచ్చేవేనోయ్‌ అన్నీ’

ఢిల్లీకి చెందిన కనిక అహుజాకు పర్యావరణ స్పృహ అనేది పాఠ్యపుస్తకాలలో నుంచో, సభలలో నుంచో వచ్చింది కాదు. చెప్పాలంటే ... బాల్యం నుంచి పర్యావరణ విషయాలను వింటూ పెరిగింది. తల్లిదండ్రులు నెలకొల్పిన ‘కన్జర్వ్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణకోణం లో తనకు ఎన్నో విషయాలపై అవగాహన కలిగింది.

కర్ణాటకలో ఇంజినీరింగ్‌ చేసిన తరువాత ఎంబీఏ చేసింది కనిక. ఆ తరువాత ఒక మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థలో చేరింది. అంతా బాగానే ఉంది. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనే ఆలోచన కొందరిలో వస్తుంది. ‘ఎక్కడో ఒకచోట, ఎక్కడైతేనేం’ అనుకునేవారు అక్కడే ఆగిపోతారు.

అక్కడ నుంచి కొత్త ప్రయాణం ప్రారంభించే వారు మాత్రం విజయశిఖరాలకు చేరువవుతారు. మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థలో పనిచేస్తున్న కనిక ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనుకుంది ఒకరోజు. వెంటనే తల్లిదండ్రుల ఆధ్వర్యంలోని స్వచ్ఛందసంస్థలో చేరి పనిచేయడం మొదలుపెట్టింది.

అలా పనిచేస్తున్న క్రమంలో తనకు ‘లిఫాఫ’ బ్రాండ్‌ ఐడియా వచ్చింది. ఎక్కడో ఒకచోట మురికిగా, చెత్తగా కనిపించే ప్లాస్టిక్‌ వ్యర్థాలపై మన దృష్టి మరలదు. మరి వాటినే అందమైన వస్తువులుగా తయారుచేస్తే? వ్యర్థాలకు ఒక అర్థం దొరుకుతుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. గొంగళి పురుగులు సీతాకోకచిలుకలై అందంగా ఎగిరే రోజులు వచ్చాయి!

పేదలు, అనాథలు.. మొదలైన వారికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎలా రీసైకిలింగ్‌ చేయాలో నేర్పించింది. ఈ హ్యాండ్‌మేడ్‌ రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ పనిని ఆ తర్వాత ఎంతోమంది నేర్చుకున్నారు.

గ్లోబల్‌ వెంచర్‌ ఫండ్‌ అశోక నుంచి ఫండింగ్‌ దొరకడం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి అందమైన బ్యాగులు, రకరకాల యాక్సెసరీలు తయారయ్యాయి. ఎంత బాగున్నాయో! ‘మన సంబరం సరే, జనాలు ఏమనుకుంటారో’ అనుకుంది కనిక. అయితే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ‘లిఫాఫ’ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘వీటిని ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారుచేశాం’ అని చెబితే నమ్మిన వారు తక్కువ!

ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్యాషన్‌ వీక్‌ తమ ఉత్పత్తులకు బ్రేక్‌ ఇచ్చింది. మన దేశంలోనే కాదు అమెరికా, యూరప్‌లలో కూడా ‘లిఫాఫ’ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారుచేశారు’ అనేది సెల్లింగ్‌ పాయింట్‌గా మారింది.

‘లిఫాఫ ద్వారా ఉపాధి దొరకడంతోపాటు పర్యావరణానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్న విషయాలను వేరే వాళ్లకు చెబుతున్నాను’ అంటుంది ఇరామ్‌ అలి.

ప్లాస్టిక్‌–టు–ఫ్యాబ్రిక్, జీరో–వేస్ట్‌ ప్రాడక్షన్‌ మెథడ్స్, లో–కార్బన్‌ టెక్ట్స్‌టైల్‌ రీసైకిలింగ్‌... మొదలైన పదునైన బాణాలు ‘లిఫాఫ’ అమ్ములపొదిలో ఉన్నాయి. అందుకే లక్ష్యాన్ని చేధించడం సులువు అయింది! ఇక ఇప్పటి వరకు ఈ సంస్థ సుమారు 12 టన్నుల వ్యర్థాల నుంచి వాలెట్లు, బ్యాగులు ఇతర ఉత్పత్తులు తయారయ్యాయి. గతేడాది వరకు కోటి రెవెన్యూ వచ్చింది.

చదవండి: West Bengal: ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్‌ బటన్‌ను నొక్కితే చాలు!

మరిన్ని వార్తలు