సేంద్రియ బ్యూటీ

23 Jul, 2021 06:21 IST|Sakshi

తీవ్రమైన చర్మ సంబంధ సమస్యలతో తల్లి చనిపోయింది. తల్లికి అన్నీ తానై సేవలందించిన కృతికకు తల్లి చనిపోయాక ఏం చేయాలో తోచలేదు. దీంతో తన తల్లిపడిన కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో చర్మానికి హానికరం కానీ కూరగాయలు, మేకపాలతో సబ్బులు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసింది. వాటిని విల్వా పేరుతో విక్రయిస్తోంది తమిళనాడుకు చెందిన కృతిక.

తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో కృతిక కుమరన్‌ పచ్చని పంటపొలాల మధ్య పెరిగింది. 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. దీంతో ఎçప్పుడూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. చిన్నప్పటినుంచి అమ్మ మంజులాదేవితో అనుబంధం ఎక్కువ. మంజులా దేవికి చర్మ సంబంధ సమస్య వచ్చింది. అది తగ్గడానికి వివిధ రకాల స్టెరాయిడ్స్‌ వాడడంతో అవి చర్మసమస్యను తగ్గించకపోగా కిడ్నీలు పాడయేలా చేశాయి. దీంతో మంజులాదేవి 2016లో మరణించారు.

ఎప్పుడూ తనతో ఉండే అమ్మ దూరం కావడాన్ని కృతిక తట్టుకోలేకపోయింది. నిరాశానిస్పృహలకు గురవుతుండేది. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలనుకుంది. ఈ క్రమంలోనే... వివిధరకాల సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల వల్ల చర్మసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అమ్మను దగ్గరనుంచి చూసిన కృతికకు మార్కెట్లో దొరికే వాటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో వాటిని తయారు చేయాలనుకుంది. కానీ వాటిని ఎలా రూపొందించాలో తెలిసేది కాదు.

మేకపాలతో సబ్బు..
వివిధ రకాల పదార్థాలతో సహజసిద్ధంగా సబ్బులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. నేచురల్‌ కాస్మటాలజీ కోర్సు చేసింది. మేకపాలకు కొన్ని ఇతర రకాల పదార్థాలు కలిపి సబ్బులు తయారు చేసి తెలిసిన వారికి, స్నేహితులకు ఇచ్చేది. ఆ సబ్బులు తామరవ్యాధితో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతున్నట్లు చెప్పడంతో కృతికకు మంచి ప్రోత్సాహంగా అనిపించింది. ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేది.

విల్వా..
అమ్మ చనిపోయిన ఏడాది తరువాత 2017లో ‘విల్వా’ పేరుతో స్టోర్‌ను ప్రారంభించింది. బిల్వపత్రం పేరుమీదగా ఈ పేరుపెట్టింది. ప్రారంభంలో కృతిక తయారు చేసే ఉత్పత్తులను ఫేస్‌బుక్‌ పేజిలో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేసింది. సబ్బులతోపాటు, స్కిన్‌కేర్, బ్యూటీ ఉత్పత్తులను  సహజసిద్ధ పదార్థాలు, ఎసెన్షియల్‌ ఆయిల్స్, వెన్నను ఉపయోగించి తయారు చేసేది. క్లెన్సర్స్, టోనర్స్, ఫేస్‌మాస్క్‌లు, సీరమ్స్, కండీషనర్లు, మాయిశ్చరైజర్, జెల్, పెదవులు, కళ్లకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, షాంపులు, హెయిర్‌ ఆయిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. మహిళలకేగాక, పురుషులకు సైతం బ్యూటీ ఉత్పత్తులను అందించడం విశేషం. ఇండియాలోనేగాక, యూకే, యూఎస్, మలేసియా, సింగపూర్, గల్ఫ్‌దేశాలకు సైతం కృతిక తన విల్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వివిధ ఆన్‌లైన్‌ వేదికలపై విల్వా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి.

మరిన్ని వార్తలు