గర్భంతో పరుగు..    

22 Oct, 2020 04:43 IST|Sakshi
మాకేనా మిల్లెర్‌

‘గర్భం దాల్చగానే ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. ఆమెకు ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలనుకుంటారు. దీంతో గర్భం దాల్చిన స్త్రీ కూడా చాలా సున్నితత్వానికి లోనవుతుంది. దీనివల్ల ప్రసవాలు సులువుగా జరగడం లేదు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి మద్దతు లేకుండా తమ పనులన్నీ తాము చేసుకోగలరు, ఇది సమాజం తెలుసుకోవాల’ని అమెరికన్‌ మహిళ మిల్లెర్‌ కోరుకుంటున్నది. తొమ్మిది నెలల గర్భవతి మాకేనా మిల్లెర్‌ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని నిరూపించింది. 

గర్భిణీ స్త్రీల గురించి ప్రజల ఆలోచనను మార్చాలని కోరుకుంది మిల్లెర్‌. ప్రసవం తర్వాత ఆ స్త్రీ చురుకుదనాన్ని కొనసాగించాలని కూడా మిల్లెర్‌ కోరుకుంటోంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన అమెరికన్‌ మహిళ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కి.మీ పరిగెత్తింది. ‘నన్ను ప్రోత్సహించడానికి, 9 నెలల గర్భంతో 8 నిమిషాల్లో మైలు రికార్డును బద్దలు కొడితే నాకు 100 డాలర్లు ఇస్తానని నా భర్త చెప్పాడు’ అని తెలిపింది మిల్లెర్‌. మిల్లెర్‌ వీడియోను ఆమె భర్త మైక్‌ రూపొందించాడు. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది వీక్షించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అయ్యింది.

భర్త మైక్‌తో మాకేనా మిల్లెర్‌  

మిల్లెర్‌ మాట్లాడుతూ ‘మైక్‌ నా వీడియో చేసినట్లు ముందు నాకు తెలియదు. ఈ పోటీ జరిగిన తరువాతి రోజు నాకు తెలిసింది’ అని ఆనందంగా తెలిపింది. మిల్లెర్‌ వీడియోను చూసిన కొంతమంది ‘పుట్టబోయే బిడ్డకు ఏదైనా హాని ఉందా. ఆ బిడ్డ గురించి ఆందోళన చెందుతున్నాం’ అని తమ స్పందనను తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా మైక్‌ ‘వైద్య నిపుణుడితో సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆందోళన చెందవలసిన అవసరం లేదు’ అని తెలిపాడు. పరిగెత్తే ముందు డాక్టర్‌ సోనోగ్రఫీ చేసి, శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పారు. దీంతో నేను ఈ పనిని ధైర్యంగా చేయగలిగానని చెబుతోంది మిల్లెర్‌. 

మరిన్ని వార్తలు