అమ్మాయిల మ్యూజిక్‌ బ్యాండ్‌.. ‘ఉమేనియా’!

5 Mar, 2021 09:18 IST|Sakshi

మనకెంతో ఇష్టమైన రంగంలో మంచి స్థాయికి ఎదగాలని కలలు కంటాము. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలతో అనుకున్న దారిలో కాకుండా మరో దారిలో ప్రయాణిస్తూ.. జీవితాన్ని నెట్టుకొస్తుంటాం. ఈ జన్మకింతేలే అని సరిపెట్టుకునేవారు లేకపోలేదు. కానీ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన స్వాతీసింగ్‌ తనకిష్టమైన సంగీతాన్నీ నేర్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్నీ వదిలేసింది. శాకాంబరి కొట్నాల అనే మరో మహిళ మంచి లాభాలు వస్తోన్న బోటిక్‌ను మూసేసి సంగీతం నేర్చుకుని దాన్నే కెరీయర్‌గా మలుచుకున్నారు. తనలా సంగీతం అంటే ఎంతో ఇష్టముండే శాకాంబరితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలను కలుపుకుని స్వాతీసింగ్‌ ‘ఉమేనియా బ్యాండ్‌’ను  ఏర్పాటు చేసి ఎంతో విజయవంతంగా నడుపుతున్నారు.

ఈ బ్యాండ్‌లో ఓ 16 ఏళ్ల అమ్మాయికూడా ఉండడం విశేషం. సంగీతమంటే చెవికోసుకునే స్వాతీసింగ్‌కు.. 2007లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ ఉద్యోగం వచ్చింది. తన అభిరుచి వేరుగా ఉండడం వల్ల టీచర్‌ ఉద్యోగానికి న్యాయం చేయలేను అని భావించి ఆరు నెలల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తరువాత తనకెంతో ఇష్టమైన సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే అందరూ అమ్మాయిలు ఉన్న ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ బ్యాండ్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్‌ కూడా మహిళలే వాయించాలని ఆమె కోరిక. బ్యాండ్‌కోసం అమ్మాయిలను వెతికి 14 ఏళ్ల తరువాత..  2016 మార్చి 8న శాకాంబరి కొట్నాల (44), శాకాంబరి కూతురు శ్రీవిద్య కొట్నాల (16), విజుల్‌ చౌదరీ(24)లతో కలిసి స్వాతీ సింగ్‌ ‘ఉమేనియా బ్యాండ్‌’ ను ఏర్పాటు చేశారు.

తొలినాళ్లల్లో ఈ బ్యాండ్‌కు అంత ఆదరణ దొరకలేదు. క్రమంగా వీరి లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ చూసేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈ బ్యాండ్‌కు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. బ్యాండ్‌లో స్వాతీ సింగ్‌ ప్రధాన గాయకురాలేగాక మంచి గిటారిస్టు కూడాను. ఈ బ్యాండ్‌ ముఖ్యంగా క్లాసికల్, సూఫీ మ్యూజిక్‌తోపాటు బాలీవుడ్‌ సాంగ్స్‌ను పాడుతుంటుంది. ఇవేగాక బృందం స్వయంగా కంపోజ్‌ చేసిన సాంగ్స్‌తోపాటు, డౌరీ, మహిళా సాధికారత, స్త్రీలపై జరుగుతున్న దాడులపై సమాజాన్నీ జాగృతం చేసే గీతాలు కూడా ఆలపిస్తారు. శాకాంబరీ బోటిక్‌ను మూసేసి ఈ బ్యాండ్‌లో చేరడమేగాక.. తన కూతురు శ్రీవిద్యను కూడా బ్యాండ్‌లో చేర్చారు.

శ్రీవిద్య  ఎనిమిదో ఏట నుంచే డ్రమ్స్‌ వాయించడంలో శిక్షణ తీసుకుంది. 16 ఏళ్లున్న శ్రీవిద్య బ్యాండ్‌లో మంచి డ్రమ్మర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాండ్‌ లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌లేగాక, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా పెర్‌ఫార్‌మెన్స్‌ వీడియోలతో వేలమంది ఫాలోవర్స్‌ మనుసులు దోచుకుంటుంది. వీరి ప్రతిభ ను గుర్తించిన రాష్ట్ర ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ మంత్రి రేఖా ఆర్యా... కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటకు ఉమేనియా బ్యాండ్‌ మంచి ఉదాహరణగా నిలస్తోందని మెచ్చుకున్నారు.  

మరిన్ని వార్తలు