స్మార్ట్‌ ఫిల్మ్‌; ఉమెన్‌ @ 40

10 Sep, 2022 20:37 IST|Sakshi

మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్‌ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్‌ ఎట్‌ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్‌ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్‌. 

స్మితా సతీష్‌ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్‌ ట్రైనర్‌. గతంలో స్మిత జువైనల్‌ జస్టిస్‌ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి  కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్‌ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది.


హాట్‌ ఫ్లాష్‌

ఈ ఏడాది మొదట్లో ‘హాట్‌ ఫ్లాష్‌’ అనే పేరుతో షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్‌ లక్షణాలలో ఒకటైన హాట్‌ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్‌ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. 

‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు.  


మహిళలకు అవగాహన తప్పనిసరి

నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్‌ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్‌ సాయపడుతుంది. 

‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్‌ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్‌ లేదా మెనోపాజ్‌ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...)

ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్‌ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్‌ ఫార్టీ ఫిల్మ్‌ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి:​​​​​​​ ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి)

మరిన్ని వార్తలు