వన్‌టూత్రీ విజేతలు అమ్మాయిలు..

13 Sep, 2020 08:35 IST|Sakshi

సెల్‌ఫోన్‌కి పది నెంబర్లు. ఆధార్‌కు పన్నెండు. డెబిట్‌ కార్డుకు పదహారు. ఏటీఎం పిన్‌కి నాలుగు. విజేతలకు మూడే మూడు. అవి కూడా వన్‌టూత్రీ ఆ విజేతలు కూడా అమ్మాయిలు. ఫిక్స్‌ అయినట్లున్నారు. తొలి మూడూ తమవేనని!

స్టేజ్‌ మీద నుంచి కనుకైతే ఈ విషయాన్ని ఇలా చెప్పాలి. పైగా ఇది కేవలం విషయం కాదు. విజయ దరహాసం. ‘..అండ్‌ ది ఫస్ట్‌ ర్యాంక్‌ గోస్‌ టు.. అనూజ్‌ నెహ్రా. పానిపట్‌ అమ్మాయి. సెకండ్‌ ర్యాంక్‌ సంగీతా రాఘవ్, గుర్‌గావ్‌. ఇక మూడో ర్యాంకు జ్యోతీ శర్మ ఫ్రమ్‌ మథుర. ఏంటి! అబ్బాయిల్లేరా! ఉన్నారు బాబూ.. ఉన్నారు. నాలుగో ర్యాంకు నుంచి మాత్రమే వారు ఉన్నారు. గ్రూప్‌ వన్‌ ఉద్యోగాలకు జరిగిన ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు (యు.పి.పి.ఎస్‌.సి.) పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులు ఈ ముగ్గురు అమ్మాయిలు. వీళ్లు, ఆ తర్వాతి ర్యాంకుల్లోని మిగతా అమ్మాయిలు కొద్దిరోజుల్లోనే డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ ఎస్పీలు కాబోతున్నారు.

యు.పి.పి.ఎస్‌.సి మొత్తం 988 పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్‌ నిర్వహించింది. వాటిల్లో 119 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు. 94 డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులు. మరో నలభై రకాలైన కేటగిరీలలో మిగతా పోస్టులు. 2018 అక్టోబర్‌లో పరీక్ష జరిగింది. 2019 మార్చిలో ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాయి. మెయిన్‌కి 16,738 మంది ఎంపికయ్యారు. వారికి గత ఏడాది అక్టోబర్‌లో పరీక్షలు జరిగాయి. వారిలో 2669 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్‌ అయ్యారు. ఇంటర్వ్యూలు ఈ ఏడాది జూలై–ఆగస్టు మధ్య జరిగాయి. వారిలో జాబ్‌కి ఎంపికైన వారిలో మొదటి మూడు స్థానాల్లో అనూజ్, సంగీత, జ్యోతి ఉన్నారు!

ఈ మధ్యే.. నెలక్రితం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌లో మొదటి పది లోపు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు స్థానం సంపాదించారు. అవి ఒక రాష్ట్రం పరీక్షలు కావు. దేశవ్యాప్తంగా జరిగేవి. ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించింది. అమ్మాయిల్లో ఫస్ట్‌ ర్యాంక్‌. విశాఖ యాదవ్‌ ఆరో ర్యాంకు, సంజితా మహాపాత్ర పదో ర్యాంకు సంపాదించి అమ్మాయిల్లో ప్రతిభా వర్మ తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఐ.ఎ.ఎస్‌., ఐ.ఎఫ్‌.ఎస్‌. ఐ.పి.ఎస్‌., సెంట్రల్‌ సర్వీసులు, గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి పోస్టులలో 829 ఉద్యోగాలకు జరిగిన పరీక్షలకు అవి. వాటిల్లో 150 పోస్ట్‌లను మహిళలే అది కూడా మంచి ర్యాంకులతో సాధించారు.

ప్రతి రంగంలోనూ మహిళలే ముందుండటం, అసమాన ప్రతిభా పాటవాలు కనబరచడం క్రమంగా సాధారణ విషయం అయిపోతోంది. అయితే ఆ సాధారణత వెనుక ఎప్పటికీ ఉండేది మాత్రం అసాధారణ కృషే. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు చదువుల్లో, ఉద్యోగాల్లో, వాటి కన్నా ముందు కుటుంబ పరిస్థితుల్లో అననుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వాటిని దాటుకుని పైకి వస్తున్నారు. ‘స్మాష్‌ పేట్రియార్కీ’అని కొత్తగా ఒక మహిళా ఉద్యమం ప్రారంభం అయింది. పురుషస్వామ్య పెత్తనాలపై సౌమ్యమైన తిరుగుబాటు అది. ఎక్కడైనా ఒక అమ్మాయి మంచి ర్యాంకుతో ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో ఉన్నతస్థాయికి ఎదగడం.. ఇవి కూడా పిడికిలి బిగించని తిరుగుబాట్లే. మగవాళ్ల కన్నా ఒకడుగు ముందున్నారంటేనే.. అక్కడ పేట్రియార్కీ స్మాష్‌ అవడం మొదలైనట్లు.
 

మరిన్ని వార్తలు