Womens empowerment: ఉక్కు దళం

3 Jan, 2023 00:27 IST|Sakshi
బీవోపీ–గంగ దళ సభ్యులు; ధైర్యంగా దూసుకెళ్తూ... ∙

స్త్రీ శక్తి

ఇండియా–బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్‌’ దళం రంగంలోకి దిగింది.

స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు.
ప్రసిద్ధ సుందర్‌ బన్‌ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి.

ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్‌ఎఫ్‌ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్‌ ఔట్‌ పోస్ట్‌) లను ఏర్పాటు చేసింది.
‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు.
మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి.

స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది.
‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్‌ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్‌లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్‌ సదుపాయాలు ఉన్నాయి.
‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్‌ బెంగాల్‌ ఫ్రంటియర్‌ బీఎస్‌ఎఫ్‌ డిఐజీ అమ్రిష్‌ ఆర్యా.

మరిన్ని వార్తలు