అమ్మానాన్న అయ్యేదెప్పుడో! 

11 Apr, 2022 10:39 IST|Sakshi

యువతలో సంతాన సమస్యలు  

మారిన జీవన శైలి కారణం  

యువకుల్లో స్థూలకాయం, యువతుల్లో పీసీఓడీ సమస్య   

వివాహం ఆలస్యం కావడమూ కారణమే  

జిల్లాలో 15 శాతం దంపతుల్లో సంతానలేమి సమస్య

సంతానం కోసం వైద్యుల వద్దకు క్యూ  

కర్నూలు(హాస్పిటల్‌):  పెళ్లితో ఇద్దరు ఒక్కటై ఆ తర్వాత పండండి బిడ్డకు జన్మనిచ్చి అమ్మానాన్న పిలుపుతో మురిసిపోవడం దంపతుల కల. వివాహమైన ఏడాదికో, రెండేళ్లకో వారి కల నెరవేరి ఇద్దరు ముగ్గురవుతారు. ఇప్పుడా  పరిస్థితి మారిపోతోంది. మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా యువతీయువకుల్లో సంతానలేమి సమస్య అధికమవుతోంది. సంతాన యోగ్యానికి స్త్రీ, పురుషుల్లో అనేక అడ్డంకులు ఏర్పడినప్పుడు సంతానం కోసం ఎదురుచూడక తప్పదు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పెళ్లైన ప్రతి వంద మందిలో 15 మంది దంపతులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో గైనకాలజిస్టుల వద్దకు, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఆయా వైద్యుల వద్ద నిత్యం రద్దీ కనిపిస్తుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో ప్రధానంగా కర్నూలులోని వైద్యుల వద్దకు భర్త లేదా తల్లిదండ్రులతో వెళ్లే వారు, వివిధ రకాల పరీక్షలు చేయించుకుంటున్న వారు నిత్యం కనిపిస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 200 మంది గైనకాలిజిస్టులు సేవలు అందిస్తున్నారు.

వీరి వద్దకు గర్భం దాల్చిన వారితో పాటు సంతాన సమస్యతో వైద్యులను సంప్రదించే వారు కూడా అధిక మంది ఉన్నారు. వైద్యుల సూచనలు పాటించినా సంతాన ప్రాప్తి కలగని వారు చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ఐదు సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. సంతానలేమికి   దంపతులిద్దరిలోనూ లోపాలు కారణం కావచ్చు. వైద్యపరిభాషలో సంతానం లేకపోవడానికి 40 శాతం ఆడ వారిలో, 30 శాతం మగవారిలో లేదా 20 శాతం ఇద్దరిలో లోపాలుంటున్నాయి. 10 శాతం మందిలో దాదాపుగా చెప్పలేని కారణాలతో సంతానలేమి సమస్య ఏర్పడుతోంది.        

వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు 
అండవాహికల్లో లోపాల నిర్ధారణకు హెచ్‌ఎస్‌జీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది చాలా సార్లు అండవాహికలు తెరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కొందరు కేవలం ఈ పరీక్ష ద్వారానే గర్భం దాలుస్తారు.  
► అండాశయ గర్భాశయ లోపాల నిర్ధారణకు ల్యాపరోస్కోపిక్‌ స్టడీ చేస్తారు. ఇది ఒక సర్జికల్‌ విధానం. ఈ విధానం ద్వారా కూడా సంతాన అవకాశాలు ఉంటాయి.   
► బయట నుంచి పంపిన కెమెరా ద్వారా గర్భాశయ స్థితిగతులు నిర్ధారించడం, తగిన పరిష్కారం సూచించేందుకు హిస్టరోస్కోపి చేస్తారు.  
► పురుషుల్లో వీర్యవాహిక మూసుకుపోయినప్పుడు వృషణాల నుంచి టీసా అండ్‌ పీసా విధానం ద్వారా నేరుగా వీర్యం సేకరించి ఫలితం సాధిస్తారు.    

సంతానలేమికి కారణాలు  
స్త్రీలలో..  
► ఆలస్యంగా వివాహం కావడం 
► నెలసరి సక్రమంగా రాకపోవడం 
► ఆలస్యంగా రజస్వల కావడం 
► అండం పెరుగుదల, విడుదల సక్రమంగా లేకపోవడం 
► అండం ప్రయాణించే మార్గం మూసుకుపోవడం 
► అండాశయంలో నీటి బుడగలు (పీసీవోడీ) 
► గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం 
► గర్భాశయ ముఖద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం 
► హార్మోన్ల శాతంలో తేడాలుండటం  

పురుషుల్లో   
► వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం 
► వీర్యకణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండటం 
► వీర్యంలో వీర్యకణాలు లేకపోవడం 
► వీర్యకణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం 
► హార్మోన్ల శాతంలో తేడాలుండటం 
► ధూమ, మద్యపానసేవనం, డ్రగ్స్‌కు అలవాటు పడటం 
► జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం, స్థూలకాయం, నిద్రలేకుండా పనిచేయడం 
► జన్యుపరమైన లోపాలు   

ఆహారపు అలవాట్లే కారణం 
ఇటీవల కాలంలో సంతానం లేని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధిక శాతం జీవనశైలిలో మార్పులు, వారి ఆహార విధానాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. సంతానం కలిగేందుకు ఇది పెద్ద అవరోధంగా మారుతోంది. ఇలాంటి వారు ముందుగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. – డాక్టర్‌ శిరీషారెడ్డి, ఫర్టిలిటి స్పెషలిస్టు, గైనకాలజిస్టు, కర్నూలు  

50 శాతం పురుషుల్లో సమస్య 
సమాజంలో సంతానలేమి సమస్య 10 శాతం ఉండేది. కానీ ఇప్పుడు 30 నుంచి 40 శాతం వరకు ఉంది. గతంలో పురుషుల్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వారిలో 50 శాతం మందిలో ఈ సమస్య ఉంది. దీనికి కారణం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో పని ఒత్తిడి, వారు వాడుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, చెడు అలవాట్ల వల్ల వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా మహిళల్లో సీపీవోడీ సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. – డాక్టర్‌ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు

మరిన్ని వార్తలు