పండించారు... వడ్డించారు!

18 Apr, 2023 01:06 IST|Sakshi

  ఒక చేత్తో నాగలి... ఇంకో చేత్తో గరిట! 

రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు.

దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు.

భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్‌ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను చూస్తోంది. ఆ రెస్టారెంట్‌లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు.
 
‘ఒంటరి’ పోరాటం!
‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్‌ పేరెంట్‌గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు.

ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్‌ ఫార్మింగ్‌ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్‌ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్‌ పాయింట్‌ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం.
 
మార్కెట్‌ పుట్టింది!
హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్‌ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్‌ షెఫ్‌లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్‌ పెట్టాం. రెస్టారెంట్‌ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్‌ ఫ్రీ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం.

డైటీషియన్‌లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్‌ లెవెల్స్‌ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్‌లు. మిల్లెట్స్‌ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్‌ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్‌ హోటల్‌’ ప్రారంభమైంది.

‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్‌లైన్‌. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్‌లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్‌ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్‌ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్‌లో వండుతున్నాం. ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ
ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది.  
 
వెలుగు పుట్టింది!
‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్‌ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్‌లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్‌ చదువుతూనే యంగ్‌ ఇండియా సంస్థలో వాలంటీర్‌గా పని చేశాను.

అమ్మ పట్టుపట్టి ఇంటర్‌లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్‌ స్థాపించాను. ట్రాఫికింగ్‌కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్‌లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్‌ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ.  

– వాకా మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు