28 ఏళ్ల శ్రమ: ఇది ఆడవాళ్ల ప్రపంచం

12 Dec, 2020 08:49 IST|Sakshi
హైదరాబాద్‌ సీసీటీలో చేనేత మగ్గం మీద చీరను నేస్తున్న కృష్ణవేణి

‘ఇది మగవాళ్ల సామ్రాజ్యం’ అనే కనిపించని సరిహద్దు రేఖ ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ సరిహద్దు రేఖను చెరిపి వేయడానికి ఆడవాళ్లు నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు... చేనేత మహిళలు మగ్గం సాక్షిగా ఇది ఆడవాళ్ల ప్రపంచం కూడా అని నిరూపిస్తున్నారు. అయితే... వాళ్లు చేస్తున్నది రికార్డు కోసం కాదు... పురస్కారాల కోసమూ కాదు. దారం మెడకు ఉరితాడవుతున్న మగవాళ్లు ఇతర రంగాలను వెతుక్కుంటున్నారు. ఆ... కష్టకాలంలో మహిళలు మగ్గాన్ని అందుకున్నారు.. దారంతో జీవితాలను అల్లుకుంటున్నారు.

అది హైదరాబాద్‌ నగరం బంజారాహిల్స్‌లోని సీసీటీ (క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ) భవనం. అందులో ఒక మహిళ మగ్గం మీద జామ్‌దానీ చీరను నేస్తోంది. ఆమె పేరు జనగం కృష్ణవేణి. శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలంలోని బొద్దాం గ్రామం నుంచి వచ్చిందామె. ఆమె నేస్తున్న మగ్గం మీద నిలువుదారాల కింద ఒక పేపర్‌ ఉంది. అందులో ఉన్న డిజైన్‌ని చూస్తూ రంగుల దారాలను కలుపుతోందామె. మధ్యలో కండెతో అటు నుంచి ఇటు తీస్తూ అడ్డం దారాన్ని జత చేస్తోంది. క్రమంగా డిజైన్‌ ఒక్కో వరుసనూ పూర్తి చేసుకుంటూ పూర్తి రూపం సంతరించుకుంటోంది. నేత మీద డిజైన్‌ ఒక లైన్‌ కూడా పక్కకు పోవడం లేదు. పూల రెక్కలు, ఆకులు, తీగలు అన్నీ... పేపర్‌ మీద గీసినంత నైపుణ్యంగా నేత లో ఒదిగిపోతూ చీర మీద ప్రత్యక్షమవుతున్నాయి. కృష్ణవేణికి ఈ పనిలో పదిహేనేళ్ల అనుభవం ఉంది. గ్రామాల్లో ఇలాంటి ఎందరో చేనేతకారులున్నారు. ఒకప్పుడు మగ్గం మీద మగవాళ్లు మాత్రమే పని చేసేవాళ్లు. ఇప్పుడిది ఆడవాళ్ల రంగమైంది.

తెలంగాణ హస్తకళా ప్రదర్శనల కుడ్యం, ప్రఖ్యాత హ్యాండ్‌లూమ్‌ డ్రెస్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా రూపొందించిన ఫ్యూజన్‌ చీరల ప్రదర్శన 
ఈ మార్పు వెనుక అనేక ఒడిదొడుకులున్నాయి. అష్టకష్టాలున్నాయి. ఆకలి మరణాలున్నాయి. వాటన్నింటికీ ఎదురీది చేనేత ను నిలబెట్టుకుంటున్నారు మహిళలు. చేనేతరంగం కుదేలవుతూ ఉపాధికి భరోసా కలిగించని పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడానికి మగవాళ్లు ఇతర రంగాలకు మళ్లుతున్నారు. అలాంటి తరుణంలో మహిళలు మగ్గాన్ని చేతబూనారు. ఒకప్పుడు చేనేత సామాజిక వర్గానికే పరిమితమైన నేత పనిలో అందరూ భాగస్వాములవుతున్నారు. కూరగాయలమ్ముకునే వాళ్లు, ఇతర వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కూడా చేనేతలో శిక్షణ తీసుకుని పూర్తిస్థాయి నేతకారులుగా మారినట్లు చెప్పారు కృష్ణవేణి.

ఇంటిపట్టున ఉండి ఈ పని చేసుకుంటూ నెలకు పది వేల వరకు సంపాదించుకోగలుగుతున్నట్లు చెప్పారామె. ‘‘ఇద్దరు మహిళలు మూడు నెలలపాటు మగ్గం మీద కష్టపడితే ఇక్కడ మీరు చూస్తున్న ఒక చీర తయారవుతుంది. చీర డిజైనింగ్, రంగుల తయారీ వంటివేవీ కాకుండా మగ్గం మీద పనికి పట్టే సమయం అది. కొన్ని ఇళ్లలో మగవాళ్లు కూడా ఈ పని చేస్తున్నారు. కానీ తక్కువ. మాలాంటి ఎందరో నేసిన అందమైన చీరలను మధ్య దళారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు తీసుకెళ్లి నగరాల్లో అమ్ముకునే వాళ్లు. ఇప్పుడు మాలాంటి వాళ్లకు కూడా ఈ మహా నగరంలో మా ఉత్పత్తులను ప్రదర్శించుకునే వెసులుబాటు వచ్చింది.

మా దగ్గర ఉన్న మెటీరియల్‌ను బట్టి రోజుల లెక్కన ఎన్ని రోజులు కావాలంటే అంతవరకే ఇక్కడ స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు. మా చేనేతలే కాదు, హస్తకళాకృతుల తయారీదారులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చు. మనదగ్గర కళలకు కొదవేముంది నిర్మల్‌ బొమ్మలు, చేర్యాల పెయింటింగులు, పెంబర్తి లోహపు విగ్రహాలు, శిల్పకళాకృతులకు నెలవు. మాలాగ వీటి తయారీలో కష్టపడిన వాళ్లందరూ మా వస్తువులను కొనేవాళ్లను నేరుగా చూస్తాం. వీటిని తయారు చేసింది మేమేనని గర్వంగా చెప్పుకుంటాం’’ అని కృష్ణవేణి సంతోషంగా చెప్పింది.

28 ఏళ్ల శ్రమ
ఈ నెల ఎనిమిద తేదీన ప్రారంభమైన సీసీటీ భవనం వెనుక కూడా మహిళల శ్రమ దాగి ఉంది. ఒక కళ కలకాలం మనుగడ సాగించాలంటే... ప్రజాదరణ ఉండాలి. మన దగ్గర కూచిపూడి, భరత నాట్యం, నాటకం, సంగీత కచేరీలకు మంచి వేదికలున్నాయి. కానీ హస్తకళాకృతుల ప్రదర్శనకు మాత్రం ప్రభుత్వం తరఫున  వేదికలు లేవు. ఉన్న వేదికలు కూడా ఏ ఆరు నెలలకో ఒక ఎగ్జిబిషన్‌ నిర్వహించి సరిపెడుతుంటాయి. ఈ లోటును భర్తీ చేయడమే తమ ఉద్దేశమని తెలియచేశారు సీసీటీ నిర్వహకులు ఉషా సర్వారాయలు, మీనా అప్నేందర్‌. ‘ఇది కేవలం క్రాఫ్ట్‌మెన్‌ సంక్షేమం కోసమేనని, ‘సీసీటీ స్పేసెస్‌’ పేరుతో సీసీటీలో స్థలానికి రోజుల చొప్పున నామమాత్రపు అద్దె చెల్లించి తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చని చెప్పారు మీనా. ‘‘కళ కాలంతో పాటు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగుతూ ఉండాలి. కళకు, కళాకృతులకు ఆదరణ తగ్గే కొద్దీ కళాకారులు ఇతర ఉపాధి మార్గాల్లోకి మారిపోతుంటారు.

ఇదే కొనసాగితే కళ అంతరించిపోతుంది. ఆ ప్రమాదం నుంచి హస్తకళాకృతులను రక్షించడం కోసం ఇరవై ఎనిమిదేళ్లుగా శ్రమించి ఈ భవనాన్ని నిర్మించగలిగాం. ఇది మన సంప్రదాయ కళలను సంరక్షించుకోవడం కోసం స్వచ్ఛందం గా ఏర్పాటు చేసుకున్న సంస్థ. జాతీయ స్థాయిలో ‘క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)’ ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీసీఐ రూపొందించిన నియమావళికి అనుగుణంగా హైదరాబాద్‌లో ‘క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ’ స్వతంత్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది’’అని చెప్పారు ఉష, మీనా.

సీసీటీ లో తొలి ప్రదర్శన ప్రఖ్యాత డ్రెస్‌ డిజైనర్‌ గౌరంగ్‌షా ఏర్పాటు చేశారు. ఈ నెల 13 వరకు కొనసాగే గౌరంగ్‌ వీవింగ్‌ మ్యూజియమ్‌లో శ్రీకాకుళం జామ్‌దానీ, ఔరంగాబాద్‌ పైథానీ, ఒరిస్సా ఇకత్, కోట నెట్, ధకాయ్‌ త్రీ హండ్రెడ్‌ కౌంట్, కశ్మీరీ తాపెస్ట్రీ వస్త్ర విశేషాలున్నాయి. రవివర్మ చిత్రాలను జామ్‌దాని నేతలో చేసిన ప్రయోగాలున్నాయి. వీటితోపాటు రెండు –మూడు రాష్ట్రాల చేనేత ప్రత్యేకతలను ఒక చీరలో తీసుకురావడం వంటి అనేక ప్రయోగాలకు ప్రతీక ఈ వీవింగ్‌ మ్యూజియమ్‌. 
–వాకా మంజులారెడ్డి 
 

మరిన్ని వార్తలు