కోవిడ్‌ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?

1 Aug, 2021 10:17 IST|Sakshi

సందేహం

నా వయసు 32 ఏళ్లు. ప్రస్తుతం నేను నాలుగో నెల గర్భిణిని. ఇటీవల చేయించిన రక్తపరీక్షలో డయాబెటిస్‌ ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితిలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది? దయచేసి చెప్పగలరు.
– శ్రీలక్ష్మి, గూడూరు

గర్భిణిగా ఉన్నప్పుడు డయాబెటిస్‌ రావడాన్ని ‘జెస్టేషనల్‌ డయాబెటిస్‌ మెలైటస్‌’ (జీడీఎం) అంటారు. సాధారణంగా చాలావరకు ప్రెగ్నెన్సీ 5–6 నెలల తర్వాత జీడీఎం రావడం జరుగుతుంది. మీకు నాలుగు నెలలకే నిర్ధారణ అయింది. అంటే ఇది గర్భంలోనే వచ్చిందా, లేక గర్భం రాకముందు నుంచే ఉందా, అంతకుముందు ఎప్పుడూ సుగర్‌ పరీక్ష చేయించుకోకపోవడం వల్ల తెలియలేదా అనే అనుమానం కూడా వస్తుంది. ‘హెచ్‌బీఏ1సీ’ రక్తపరీక్ష చేయించడం వల్ల సుగర్‌ లెవల్స్‌ గత మూడు నెలలుగా ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి ఒక అవగాహనకు రావచ్చు.

మీ వయసు రాశారు కాని, ఎంత బరువు ఉన్నారు, మీ అమ్మకు గాని, నాన్నకు గాని సుగర్‌ ఉందా అనే విషయాలు తెలియవలసి ఉంది. ఏది ఏమైనా మీరు గైనకాలజిస్టుతో పాటు డయాబెటిక్‌ డాక్టర్‌ పర్యవేక్షణలో కాన్పు అయ్యే వరకు ఉండవలసి ఉంటుంది. వారి సలహా మేరకు ఆహార నియమాలతో పాటు రక్తంలో సుగర్‌ లెవల్స్‌ అంటే చక్కెర శాతం పూర్తిగా అదుపులో ఉండేటట్లు వారు ఇచ్చే సుగర్‌మాత్రలు లేదా ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు కూడా వారు సూచించిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటూ, క్రమంగా సుగర్‌ టెస్టులు చేయించుకుంటూ ఉండటం వల్ల చాలావరకు ఇబ్బందులు లేకుండా కాన్పు జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి.

ఆహారంలో పిండి పదార్థాలు– అంటే అన్నం, చపాతీలు, తీపి పదార్థాలు వీలైనంత తక్కువగా తీసుకుంటూ రాగిజావ, జొన్నరొట్టెలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు, చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది. ఒకవేళ అధికబరువు ఉంటే, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. గైనకాలజిస్టు సలహా మేరకు వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు ఎక్కువగా పెరగకుండా శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు సుగర్‌ అదుపులో ఉంటుంది. మీకు నాలుగో నెలలోనే సుగర్‌ నిర్ధారణ అయింది కాబట్టి, బిడ్డలో అవయవ లోపాలు ఉన్నాయా, గుండె సమస్యలు ఏవైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి 18 వారాలకు ‘టిఫా’ స్కానింగ్, 22 వారాలకు ఫీటల్‌ 2డీ ఎకో స్కానింగ్‌ చేయించుకోండి.

అలాగే మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి మూడో నెలలో డబుల్‌ మార్కర్‌ టెస్ట్‌ చేయించుకుని ఉండకపోతే బిడ్డలో డౌన్‌ సిండ్రోమ్‌ వంటి జన్యు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ‘క్వాడ్రుపుల్‌ టెస్ట్‌’ అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. గర్భంలో డయాబెటిస్‌తో ఉన్నప్పుడు కొందరిలో బిడ్డ పెరుగుదల మరీ ఎక్కువగా ఉండటం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, కొందరిలో బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పు జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో ఏడో నెల లేదా ఎనిమిదో నెలలో బీపీ పెరగవచ్చు. బిడ్డ పెరుగుదల తెలుసుకోవడానికి ఎనిమిదో నెలలో ‘గ్రోత్‌ స్కానింగ్‌’, బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి తొమ్మిదో నెలలో డాప్లర్‌ స్కానింగ్‌ చేయించుకుని, గైనకాలజిస్టు సలహా మేరకు కాన్పును ప్లాన్‌ చేసుకోవచ్చు. 

నా వయసు 24ఏళ్లు. నాకు పెళ్లయి ఏడాదవుతోంది. నెల్లాళ్ల కిందట కోవిడ్‌ వచ్చి తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి సమస్యలూ లేవు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?
– సుమతి నర్సీపట్నం
కొంతమందిలో ‘కోవిడ్‌’ తగ్గిపోయిన తర్వాత కూడా రెండు నెలల వరకు నీరసం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మీకు ఎలాంటి సమస్యలూ లేవంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకుంటూ, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు.

మా అమ్మాయి వయసు 16ఏళ్లు. రెండేళ్ల కిందట రజస్వల అయింది. రజస్వల అయినప్పటి నుంచి కూడా ఆమెకు నెలసరి సక్రమంగా రావడం లేదు. మందులు వాడితేనే అవుతోంది. మందులు ఆపేస్తే కావడం లేదు. ఈ సమస్య తగ్గడానికి ఎన్నాళ్లు పడుతుంది? దీనికి ఏమైనా ప్రత్యేక చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందా?
– శ్రావణి, కడియం
సాధారణంగా రజస్వల అయిన తర్వాత మెదడు నుంచి జీఎన్‌ఆర్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్‌ హార్మోన్లు సక్రమంగా విడుదలై వాటి ప్రభావం థైరాయిడ్‌ గ్రంథి, అండాశయాల మీద సక్రమంగా పనిచేసి హార్మోన్లన్నీ ఒకే తాటిపైకి రావడానికి, ఇంకా వేరే సమస్యలేవీ లేకపోయినట్లయితే పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు చాలామందిలో పీరియడ్స్‌ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీ అమ్మాయికి రెండు సంవత్సరాలు దాటినా పీరియడ్స్‌ సక్రమంగా రావడం లేదు. మీ అమ్మాయి ఎత్తు, బరువు ఎంత ఉందో తెలియలేదు. ఒకవేళ బరువు మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో థైరాయిడ్‌ సమస్య వల్ల, కొందరిలో అండాశయంలో నీటి బుడగలు (పీసీఓడీ) సమస్య వల్ల, అధిక మానసిక ఒత్తిడి, ఇంకా ఇతర హార్మోన్ల సమస్యల వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు.

కాబట్టి ఒకసారి గైనకాలజిస్టుకి చూపించి, వారి సలహా మేరకు స్కానింగ్, రక్త పరీక్షలు చేయించి, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకుంటే, చాలామందిలో పీరియడ్స్‌ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 

డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు