సరిహద్దు పహారాలో ఉమెన్‌ రైఫిల్స్‌

10 Aug, 2020 01:45 IST|Sakshi

భారత్‌ పాక్‌ సరిహద్దుల్లో దశాబ్దాలుగా పురుషుల పహారానే ఉంది. కాని చరిత్రలో మొదటిసారి ఆరుగురు మహిళలు అక్కడ కావలికి తుపాకీ పట్టారు. సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వర్తిస్తున్న ఉమెన్‌ రైఫిల్స్‌ మన సైన్యానికి కొత్త డేగకళ్లు అయ్యారు.

పాకిస్తాన్‌–భారత్‌ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపంలో ఉండే కీలకమైన గస్తీ పాయింట్‌ ‘సాధనా టాప్‌’. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉండే ఈ పాయింట్‌ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు అత్యంత సమీపం. పి.ఓ.కె నుంచి పాక్‌ దన్ను ఉన్న ఉగ్రవాదులు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు, డ్రగ్స్‌ ఈ పాయింట్‌ నుంచే కాశ్మీర్‌లోకి అడుగుపెడతాయి. దశాబ్దాలుగా ఇక్కడ భారత సైనికులు పహారా కాస్తుంటారు. అయితే ఇన్నాళ్లు పురుష సైనికులు మాత్రమే పహారా కాశారు. చరిత్రలో మొదటిసారి ఇక్కడ 30 మంది మహిళలు గస్తీకి నియుక్తులు కావడం విశేషం.

ఉమెన్‌ రైఫిల్స్‌
దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పారామిలటరీ దళం అస్సాం రైఫిల్స్‌. దీనికి మహిళా విభాగం కూడా ఉంది. ఆ విభాగం నుంచి 30 మంది మహిళా సైనికులను డిప్యుటేషన్‌ మీద సైన్యంలోకి తీసుకుని వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకి పెట్టారు సైనికాధికారులు. ఆ మహిళా సైనికాధికారి పర్యవేక్షణలో పని చేసే ఈ ఆరుమంది మగసైనికులతో పాటుగా విధులు నిర్వర్తించాలి. 

గ్రామీణుల కోసం
సాధనా టాప్‌ చుట్టుపక్కల నలభై పల్లెటూళ్లు ఉన్నాయి. ఈ పల్లెల్లో ఉన్నవారు పనుల కోసం ఉపాధి కోసం నిత్యం సాధనా టాప్‌ గుండా కాశ్మీర్‌లో రాకపోక లు సాగిస్తూ ఉంటారు. అయితే ఉగ్రవాదులు, సంఘ విద్రోహులు ఈ గ్రామీణులతో కలిసిపోయి ప్రయాణించే వీలు ఉంటుంది. సైనికులు వీరిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ గ్రామీణుల్లో మహిళలు కూడా ఉంటారు కనుక మగ సైనికులకు పరిమితులు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో సోదాకు మహిళా సైనికులు అవసరమని ఉమెన్‌ రైఫిల్స్‌ను నియమించారు.

వీరు విధుల్లో చేరినప్పటి నుంచి గ్రామీణులు సౌకర్యంగా ఉంటున్నారట. మగ సైనికులతో మాట కలపడం కంటే మహిళా సైనికులతో మాట కలపడం సులువుగా ఉందని వారి అభిప్రాయం. ఇక మహిళలైతే సైనికులైనా వారూ సాటి మహిళలే కనుక ధైర్యం గా సోదాలకు సహకరిస్తున్నారు. అదే సమయంలో ఇంత ప్రమాదకరమైన చోట విధులను నిర్వర్తిస్తున్న వారిని చూసి మెచ్చుకుంటున్నారు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్‌ఫోర్స్‌లో వినిపిస్తున్న స్త్రీల విజయాలకు ఇది ఒక కొనసాగింపు. సాహస కొనసాగింపు. 

మరిన్ని వార్తలు