టెన్నిస్‌ మమ్మీస్‌

10 Sep, 2020 08:11 IST|Sakshi
సెరెనా (యు.ఎస్‌), కిమ్‌ క్లిజ్‌స్టర్స్‌ (బెల్జియం)

జన్మనివ్వడం పునర్జన్మ. కమ్‌ బ్యాక్‌ కూడా అంతే. మెట్టినింటికి కమ్‌ బ్యాక్‌. ఆఫీస్‌కి కమ్‌ బ్యాక్‌.  ఆటకు కమ్‌ బ్యాక్‌. ప్రాణం పుంజుకోవాలి.  ఫిట్‌నెస్‌తో రెడీ అవ్వాలి. టెన్నిస్‌ బరిలో ఈసారి.. తొమ్మిది మంది మమ్మీస్‌! అందరూ పవర్‌ రాకెట్స్‌

యు.ఎస్‌. ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో మొన్న మంగళవారం సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగానే 96 ఏళ్ల గ్రాండ్‌ స్లామ్‌ చరిత్రలో (వింబుల్డన్, యు.ఎస్‌., ఫ్రెంచి, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) ఒక రికార్డు నమోదు అయింది. ముగ్గురు తల్లులు ఒకేసారి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని యు.ఎస్‌. ఓపెన్‌ టోర్నమెంట్‌ గర్వంగా రెండు ట్వీట్‌లతో షేర్‌ చేసుకుంది. ‘గ్రాండ్‌ స్లామ్‌ చరిత్రలో తొలిసారి క్వార్టర్‌ ఫెనల్స్‌కు ముగ్గురు తల్లులు’ అనేది మొదటి ట్వీట్‌. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ గ్రాండ్‌ స్లామ్స్‌’ అనేది రెండో ట్వీట్‌. ప్రత్యేకించి 139 ఏళ్ల యు.ఎస్‌. ఓపెన్‌కి ఇది నిజంగానే గర్వకారణం. ఈ అవకాశం వింబుల్డన్‌కో, ఫ్రెంచికో, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కో పోలేదు.

వెరా జ్వోనారెవా (రష్యా), త్సె్వతానా (బల్గేరియా)
ఆగస్టు 31న న్యూయార్క్‌లో ప్రారంభం అయిన యు.ఎస్‌. ఓపెన్‌లో బరిలోకి దిగిన వారిలో ఈసారి తొమ్మిది మంది తలుల్లు ఉన్నారు. వీళ్లంతా గత రెండు మూడేళ్లలో కాన్పు విరామం తర్వాత ఆటలోకి తిరిగి వచ్చినవాళ్లే. కమ్‌ బ్యాక్‌ ఉమన్‌ ప్లేయర్స్‌. సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోడానికి ముందే వారిలో ఆరుగురు.. కిమ్‌ క్లిజ్‌స్టర్స్, వెరా జ్వొనారెవా, తత్జానా మారియా, కేథరీనా బాండెరెంకో, ప్యాట్రీషియా మేరియా టిగ్, ఓగ్లా గోవోర్ట్సోవా.. ఆడి ఓడారు. మదర్స్‌ కాబట్టి ఓడినా గెలిచినట్లేనని కాదు. గెలుపుకోసం చివరి వరకూ పోరాట పటిమను కనబరిచారని. మిగిలిన ముగ్గురు తల్లులూ ఒకేసారి కార్వర్‌ఫైనల్స్‌కి చేరడం రికార్డు అయినట్లే.. ఆ ముగ్గురి తల్లుల వ్యక్తిగత రికార్డులూ అసాధారణమైనవే.

ఓల్గా గోవోర్ట్సోవా (బెలారస్‌), పాట్రీషియా మారియా టిగ్‌ (రొమేనియా)
ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో మమ్మీ సెరెనా ఫైనల్స్‌కి వచ్చి, అక్కడా గెలిస్తే అది ఆమెకు 24వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ అవుతుంది. అప్పుడు.. గ్రాండ్‌స్లామ్‌లో 24 టైటిళ్లతో రికార్డును నిలుపుకుని ఉన్న ఆస్ట్రేలియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌తో సెరెనా సమానం అవుతారు. క్వార్టర్‌ఫైనల్స్‌కి చేరిన మిగతా ఇద్దరు మమ్మీలు విక్టోరియా (31), త్సె్వతానా (32) కన్నా సెరెనా సీనియర్‌. వయసు 38. సెరెనాకు ఒలింపియా అనే మూడేళ్ల కూతురు ఉంది.

తత్జానా మారియా (జర్మనీ), క్యాథెరీనా బాండెరెంకో (ఉక్రెయిన్‌)
మరో మమ్మీ త్సె్వతానా గ్రాండ్‌ స్లామ్‌లో ఇంతవరకు 105 మ్యాచ్‌లు గెలిస్తే ఓడినవి పదమూడే! ఈ బల్గేరియా క్రీడాకారిణికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. పేరు అలెగ్జాండర్‌. రెండు వారాలుగా తను కొడుకునే చూడలేదు. గత సోమవారం.. కెరీర్‌లోనే తన తొలి క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరడానికి ముందు ఆమె ఆడిన చివరి ఆట 2017లో వింబుల్డన్‌. ‘‘చాలా టఫ్‌గా ఉంది. రోజు రోజుకూ ఎక్కువ టఫ్‌ అవుతోంది’’ అంటున్నారు త్సె్వతానా. యు.ఎస్‌. ఓపన్‌ గురించి కాదు.. కొడుకును చూడకుండా ఉండలేకపోవడం గురించి. ‘‘నాకు తెలుసు. వాడు నన్ను చూస్తూ ఉండి ఉంటాడు’’ అని చెప్పుకుని మురిసిపోతున్నారు కూడా. త్సె్వతానా వయసు 32.

విక్టోరియా (బెలారస్‌) 
మూడో మమ్మీ  విక్టోరియా (31). బెలారస్‌ దేశ క్రీడాకారిణి. అమెరికన్‌ క్రీడాకారిణి సెరెనాలా ఈమె మరో మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌. 2015 తర్వాత ఆమె మళ్లీ యు.ఎస్‌. ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కి లోకి రావడం ఇదే మొదటిసారి. ఆమెకు లియో అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. బరిలో తనతో పాటు ఉన్న తక్కిన తల్లుల్ని చూసి ‘ఇటీజ్‌ ఇన్‌స్పైరింగ్‌’ అని ఆశ్చర్యపోతున్నారు విక్టోరియా. పిల్లలు పుట్టినా మన కలలు కొనసాగుతూనే ఉండాలి అంటున్నారు. ‘‘తల్లి అనే గుర్తింపు గొప్పది. ఆ గుర్తింపునకు క్రీడాకారిణి మరింత గుర్తింపు తెస్తుంది’’ అంటారు విక్టోరియా. ఇప్పుడీ ముగ్గురు తల్లులు ఏకకాలంలో గ్రాండ్‌ స్లామ్‌కే గుర్తింపు తెచ్చిపెట్టారు. గత ఏభై ఏళ్లలో ఇప్పటి వరకు తల్లులు అయ్యాక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన వాళ్లు కూడా ముగ్గురే. మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా), ఎవోన్‌ గూలగోంగ్‌ (ఆస్ట్రేలియా), కిమ్‌ క్లిజ్‌స్టర్స్‌ (బెల్జియం).

మరిన్ని వార్తలు