క్వీన్స్‌ ఎక్స్‌ప్రెస్‌

10 Mar, 2023 01:36 IST|Sakshi

భలే మంచి రోజు

‘టికెట్‌ కలెక్టర్‌గా అమ్మాయి!’‘ట్రైన్‌ డ్రైవర్‌ అమ్మాయట!’‘ట్రైన్‌ గార్డ్‌గా అమ్మాయి!’... ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలను చూసింది కాలం.వివిధ హోదాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని చూసి గర్వించింది కాలం.పరుగెత్తే కాలంలో ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆరోజు అచ్చంగా అలాంటిదే!

కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ‘కన్నుల పండగ’ అనేది పండగరోజు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దినాలలో కూడా రావచ్చు. మొన్నటి మహిళా దినోత్సవం రోజు అలాంటి కన్నుల పండగ జరిగింది.సెంట్రల్‌ రైల్వే ముంబై డివిజన్‌ అందరూ మహిళలే ఉన్న బృందానికి ముంబై–పుణె దక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగించింది.

ఆరోజు ఆ ట్రైన్‌లోకి అడుగు పెడితే...డ్రైవర్‌ సీట్లో దర్జాగా కూర్చున్న లోకో–పైలట్‌ సురేఖ యాదవ్, టికెట్‌ కలెక్టర్‌లుగా విధులు నిర్వహిస్తున్న నీతు, రుబినా, బీనా, సురక్ష, జెన్, దీపలతో రైలు కొత్తగా కనిపించింది.‘ఈరోజు నిజంగా మరిచిపోలేని రోజు. రైలును మహిళలే నడిపిస్తున్నారనే భావన గర్వంగా ఉంది. నా వృత్తిజీవితంలో ఇది గుర్తుంచుకోదగిన రోజు’ అంటుంది లోకో–పైలట్‌ సురేఖ యాదవ్‌.

లోకో–పైలట్‌గా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు...‘అది కఠినమైన వృత్తి. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. మహిళలకు ఎంతమాత్రం సరిపడని వృత్తి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు.వాటిని పట్టించుకొని ఉంటే ఆమె పేరు పక్కన ‘లోకో–పైలట్‌’ అనే విశేషణం గర్వంగా కాలర్‌ ఎగరేసేది కాదు.‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావాలి’ అంటుంది అసిస్టెంట్‌–లోకో పైలట్‌ లీనా ఫ్రాన్సిస్‌.

చిన్నప్పుడెప్పుడో ట్రైన్‌ ముందు బోగీలో గంభీరంగా కూర్చున్న డ్రైవర్‌ను చూసిన తరువాత తాను కూడా డ్రైవర్‌ కావాలనుకుంది.‘అలా కుదరదు. వీలు కాదు’ అనే మాటల మధ్య కూడా తన ఆశను కోల్పోలేదు.వృత్తిజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ‘హాయిగా ఫ్యాన్‌ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాకుండా ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు తల్లీ. ట్రైన్‌ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. జాగ్రత్త’ అన్నవాళ్లు కూడా ఉన్నారు.

శుభమా అని ఉద్యోగంలోకి అడుగు పెడుతుంటే ఈ మాటలేమిటని లీనా ఫ్రాన్సిస్‌ చిన్న బుచ్చుకోలేదు. ‘వాళ్లంతేలే!’ అని మాత్రమే అనుకుంది.సురేఖ యాదవ్‌ నుంచి రుబినా వరకు తమకు ఇష్టమైన వృత్తిలోకి రావడానికి ముందు ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఈ బండి ప్రయాణికులనే కాదు వారి విజయాలను కూడా మోసుకుంటూ వెళ్లింది!
 

మరిన్ని వార్తలు